'దూకుడుకు మారుపేరు.. అదే పంత్‌కు బలం'

3 Apr, 2021 11:34 IST|Sakshi

ముంబై: ఐపీఎల్‌ 14వ సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ దూరం కావడంతో ఆ జట్టు యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పిన సంగతి తెలిసిందే. ఢిల్లీ జట్టులో అశ్విన్‌, రహానే, స్మిత్‌ లాంటి అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నా మేనేజ్‌మెంట్‌ మాత్రం జట్టు కెప్టెన్‌గా పంత్‌వైపే మొగ్గుచూపింది. అసలే దూకుడుగా మారుపేరుగా నిలిచిన పంత్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఎంపికవడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. పంత్‌కు కెప్టెన్సీ అప్పగించడంపై పలువురు మాజీ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌ మహ్మద్‌ కైఫ్‌ కూడా పంత్‌ కెప్టెన్సీపై స్పందించాడు.

''గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్‌కు చేర్చిన శ్రేయాస్‌ అయ్యర్‌ గాయపడడం మా దురదృష్టం. అతను గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని కోరుతున్నా. ఇక మా దిల్‌ కా కడక్‌ లాండా.. రిషబ్‌ పంత్‌ కెప్టెన్‌గా ఎంపికైనందుకు ముందుగా అతనికి అభినందనలు.  పంత్‌ ఇప్పుడు సూపర్‌ ఫాంలో ఉన్నాడు. అతని దూకుడే అతనికి బలంగా మారనుంది. ఆసీస్‌, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ల్లో పంత్‌ ఆడిన దూకుడైన ఇన్నింగ్స్‌లే అందుకు నిదర్శనం. ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించనున్న పంత్‌కు ఆ బాధ్యతలు అతన్ని వేరే లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయం.

ఇక ఢిల్లీతో నా అనుబంధం ప్రత్యేకమైనది. ఢిల్లీలో పుట్టి పెరిగిన నాకు ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంట్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించడం సవాల్‌తో కూడుకున్న పని. ప్రధాన కోచ్‌గా ఉన్న పాంటింగ్‌తో కలిసి పనిచేయడం మంచి అనుభూతిని కలిగిస్తుంది. నాపై నమ్మకంతో మేనేజ్‌మెంట్‌ నాకు అప్పగించిన అసిస్టెంట్‌ కోచ్‌ పదవిని సక్రమంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తా. ఆటగాళ్లను సమన్వయం చేసుకుంటూ ఢిల్లీ క్యాపిటల్స్‌కు టైటిల్‌ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 10న ముంబై వేదికగా సీఎస్‌కేతో ఆడనుంది.
చదవండి:
పంత్‌ మంచి కెప్టెన్‌ అవుతాడు: మాజీ క్రికెటర్

అతను దూరమవడానికి పుజారా కారణమా!

మరిన్ని వార్తలు