ఒక్క ప్లేయర్‌ కోసమే గేమ్‌ ప్లాన్‌ ఉండదు: మోర్గాన్‌ కౌంటర్‌

18 Apr, 2021 20:26 IST|Sakshi
Photo Courtey: IPL Twitter

చెన్నై:  ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో తాము ఓడిపోయిన జట్టుగా తాము శ్రమించిన తీరు అభినందనీయమని కేకేఆర్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ స్పష్టం చేశాడు. తాము చేసిన చిన్నచిన్న తప్పిదాల్లో ప్రతీదాన్ని ఆర్సీబీ వినియోగించుకోవడంలో సఫలమైందన్నాడు. ఇక్కడ తమ జట్టు ప్రదర్శనను తక్కువ చేసి చూడటం లేదన్న మోర్గాన్‌.. ఆర్సీబీ భారీ పరుగులు చేయడంతోనే లక్ష్యం కష్టమైందన్నాడు. ఛేజింగ్‌లో‌ తాము ఎంతవరకూ అత్యుత్తమ ప్రదర్శన చేయాలో అంతా చేశామన్నాడు. మ్యాచ్‌ తర్వాత అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన మోర్గాన్‌.. చెన్నై వికెట్‌ క్రమేపీ మెరుగ్గా కనిపిస్తుందన్నాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్‌ అద్భుతంగా సాగిందన్నాడు. 

ఇక వరుణ్‌ చక్రవర్తితో పవర్‌ ప్లేలో మరొక ఓవర్‌ వేయించకపోవడంపై మోర్గాన్‌ కౌంటర్‌ ఎటాక్‌  దిగాడు. దీనిపై ఇప్పటికే విమర్శలు వస్తున్న నేపథ్యంలో తన నిర్ణయాన్ని సమర్థించుకునే యత్నం చేశాడు. ‘ మేము వరుణ్‌ చేత పవర్‌ ప్లేలో మరొక బౌలింగ్‌ చేయించకపోవడానికి కారణం ఉంది. అప్పుడే మ్యాక్స్‌వెల్‌ వచ్చాడు. మ్యాక్సీ విధ్వంసకర ఆటగాడు కానీ అతనొకడే ఆర్సీబీ జట్టులో స్టార్‌ ప్లేయర్‌ కాదు కదా. ఏబీ డివిలియర్స్‌ ఉన్నాడు. దాంతో బ్యాటింగ్‌లో ఆర్సీబీ బలోపేతమైంది. దాంతో వరుణ్‌ ఓవర్లను పవర్‌ ప్లేలో ఆపాల్సి వచ్చింది. ఒక్క ఆటగాడి కోసమే గేమ్‌ ప్లాన్‌ అనేది ఉండదు’ అని మోర్గాన్‌ చెప్పుకొచ్చాడు. 

ఆర్సీబీ భారీ స్కోరు చేయడానికి ఇయాన్‌ మోర్గాన్‌ చేసిన తప్పిదాలేనని కేకేఆర్‌ మాజీ కెప్టెన్‌ గౌతం గంభీర్‌ వేలెత్తి చూపాడు. ప్రధానంగా కోహ్లి(5), రజత్‌ పాటిదార్‌(1)లను రెండో ఓవర్‌లోనే ఔట్‌ చేసిన వరుణ్‌ చక్రవర్తిని సరిగా వినియోగించుకోలేకపోవడమేనని గంభీర్‌ ధ్వజమెత్తాడు.  ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌తో గంభీర్‌ మాట్లాడుతూ.. మోర్గాన్‌పై చిందులు తొక్కాడు. ‘ నీ కెప్టెన్సీ నువ్వు.. నీలాంటి కెప్టెన్‌ను నా జీవితంలో చూడలేదు. ఒక బౌలర్‌ ఎవరైనా అతను వేసిన తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు సాధిస్తే ఏం చేస్తాం. అతన్నే కొనసాగిస్తాం. అలా కోహ్లి, పాటిదార్‌లను ఔట్‌ చేసిన వరుణ్‌ చక్రవర్తిని పక్కన పెట్టి షకీబుల్‌ హసన్‌ను ఎందుకు తీసుకొచ్చావ్‌.  ఒక ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన బౌలర్‌ను కాదని అతని స్పెల్‌నే మార్చేశావ్‌’ అంటూ మండిపడ్డాడు గంభీర్‌.

ఇక్కడ చదవండి: నీలాంటి కెప్టెన్‌ను చూడలేదు.. చాలా విచిత్రంగా ఉన్నావ్‌!
ఐపీఎల్‌ 2021: హ్యాట్రిక్‌‌ విజయం‌తో దుమ్మురేపిన ఆర్‌సీబీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు