వైరల్‌: దటీజ్‌ ధోని.. ఒకరు ఫినిషర్‌, మరొకరు..!

17 Apr, 2021 12:59 IST|Sakshi
Photo Courtesy: CSK Twitter

షారుఖ్‌కు ధోని సలహాలు.. వైరల్‌ ఫొటో

ముంబై: టీమిండియా కెప్టెన్‌గా, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథిగా ఎంఎస్‌ ధోనికి ఉన్న అపార అనుభవం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కెప్టెన్సీతో భారత్‌కు ఎన్నో చారిత్రక విజయాలు అందించిన ఈ జార్ఖండ్‌ డైనమైట్‌.. ఐపీఎల్‌లోనూ చెన్నైని మూడుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. అంతేకాదు ఐదుసార్లు రన్నరప్‌... ఒక్కసారి మినహా ఆడిన ప్రతీ సీజన్‌లోనూ టాప్‌–4లో ఉంచి, క్యాష్‌ రిచ్‌లీగ్‌లో అత్యంత నిలకడైన జట్టుగా సీఎస్‌కే రికార్డు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడి నుంచి పాఠాలు నేర్చుకోవడానికి ఎవరైనా ఉత్సాహం చూపిస్తారు. అవకాశం వస్తే తనతో కాసేపు ముచ్చటించాలనుకుంటారు. ఐపీఎల్‌-2021లో భాగంగా, శుక్రవారం నాటి మ్యాచ్‌ అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు షారుఖ్‌ ఖాన్‌కు ఈ అవకాశం దక్కింది. 

ఈ మ్యాచ్‌లో చెన్నై ఆరు వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలుపొందిన సంగతి తెలిసిందే. సీఎస్‌కే బౌలర్‌ దీపక్‌ చహర్‌ ధాటికి తమ టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టినా షారుఖ్‌ ధైర్యంగా నిలబడి, 47 పరుగుల(36 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు)తో రాణించాడు. తమ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ధోని షారుఖ్‌కు  ఆట గురించి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోను  సీఎస్‌కే సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా, ‘‘ఒకరు ఫినిషర్‌.. మరొకరు అదే బాటలో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు’’అంటూ రీట్వీట్‌ చేసింది. ఇక ఐపీఎల్‌ సైతం.. ‘‘బ్యూటీ ఆఫ్‌ ఐపీఎల్‌’’ అని కామెంట్‌ జతచేసింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ధోని ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌కు సలహాలు ఇస్తున్న విధానానికి ఫిదా అవుతూ.. ‘‘దటీజ్‌ ధోని’’ అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: నాకైతే ఫీల్డ్‌లో 11 మంది జడ్డూలు కావాలి: చహర్‌
ధోనికి గుర్తుండిపోయే మ్యాచ్‌ ఇది..!

మరిన్ని వార్తలు