ముంబై ఇండియన్స్‌కు షాక్‌.. కీలక సభ్యుడికి కరోనా

6 Apr, 2021 16:35 IST|Sakshi

ముంబై: టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌, ముంబై ఇండియన్స్‌ వికెట్‌ కీపింగ్‌ సలహాదారు కిరణ్‌ మోరేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయన వైరస్‌ బారిన పడినట్లు తేలిందని ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం వెల్లడించింది. మోరేకు ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ, నిబంధనల ప్రకారం ఆయనను ఐసోలేషన్‌కు తరలించి, వైద్యుల పర్యవేక్షణలో చికిత్సనందిస్తున్నామని పేర్కొంది. మోరే.. ముంబై ఇండియన్స్‌కు వికెట్‌ కీపింగ్‌ కన్సల్టెంట్‌‌గా, ప్రతిభాన్వేషకుడిగా వ్యవహరిస్తున్నారు.

కాగా, బీసీసీఐ రూపొందించిన ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుందని ముంబై యాజమాన్యం పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బుసలు కొడుతున్న వేళ అభిమానులు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 40వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా నైట్‌ కర్ఫ్యూ, వీకెండ్‌ లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నా వైరస్‌ మాత్రం చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ముగ్గురు వాంఖడే మైదాన సిబ్బంది కరోనా బారినపడటంతో ముంబై ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
చదవండి: వాంఖడేలో చాపకింద నీరులా కరోనా.. తాజాగా మరో ముగ్గురికి

మరిన్ని వార్తలు