కోల్‌కతా...చేజేతులా

14 Apr, 2021 04:39 IST|Sakshi
విజయానంతరం ముంబై ఆటగాళ్ల సంబరం, దినేశ్‌ కార్తీక్‌

గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన నైట్‌రైడర్స్‌

10 పరుగులతో ముంబై ఇండియన్స్‌ గెలుపు

తిప్పేసిన రాహుల్‌ చహర్‌

రసెల్‌ సూపర్‌ స్పెల్, రాణా ఫిఫ్టీ వృథా

డిఫెండింగ్‌ చాంపియనా మజాకా... వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడే పరిస్థితిని తప్పించి మరీ ముంబై ఇండియన్స్‌ విజయం సాధించింది. గెలుపు కోసం కోల్‌కతా చివరి 30 బంతుల్లో 31 పరుగులే చేయాల్సి ఉన్నా... క్రీజులో రసెల్, దినేశ్‌ కార్తీక్‌లాంటి హిట్టర్లున్నా... ఆ జట్టు అనూహ్యంగా తడబడింది. గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుంది. ఈ మ్యాచ్‌కంటే ముందు ఐపీఎల్‌లో కోల్‌కతాతో ఆడిన 27 మ్యాచ్‌ల్లో 21 సార్లు గెలిచిన ముంబై మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. చివరి ఐదు ఓవర్లలో కేవలం 21 పరుగులే ఇచ్చి ఓటమి అంచుల్లో నుంచి విజయతీరానికి చేరింది. చిత్రంగా చివరి 30 బంతుల్లో ముంబై కేవలం ఒకే ఒక్క బౌండరీ మాత్రమే సమరి్పంచుకుందంటే ఆ జట్టు పోరాటపటిమను, బౌలర్ల శ్రమను కచ్చితంగా అభినందించాల్సిందే!

చెన్నై: ఈ సీజన్‌లో రోహిత్‌ శర్మ సేన బోణీ కొట్టింది. తమ రెండో మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలుపొందింది. మొదట రసెల్‌ (కోల్‌కతా) వేసిన ఆఖరి ఓవర్లే హైలైట్‌ అనుకుంటే... తర్వాత బౌల్ట్‌ (ముంబై) వేసిన ఆఖరి ఓవర్‌ అంతకుమించి హైలైట్‌గా నిలిచింది. 1, 1, వికెట్, వికెట్, 2, 0లతో అతను వేసిన ఆఖరి ఆరు బంతులు కోల్‌కతాను ముంచేసింది. తొలుత ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌటైంది. టాపార్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (36 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (32 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మెరిపించారు. రసెల్‌ (5/15) ముంబైని అనూహ్యంగా కట్టడి చేశాడు. తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. ఇక్కడా టాపార్డరే ఆడింది. నితీశ్‌ రాణా (47 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుబ్‌మన్‌ గిల్‌ (24 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణిస్తే మిగతా వారెవరూ కనీసం పట్టుమని పది పరుగులైనా చేయలేకపోయారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రాహుల్‌ చహర్‌ (4/27) తన స్పిన్‌తో కోల్‌కతాను తిప్పేశాడు.   

సూర్య ‘మెరుపుల్‌’ 
ముంబై ఆట మొదలైన రెండో ఓవర్లోనే డికాక్‌ (2) వికెట్‌ను కోల్పోయింది. వరుణ్‌ చక్రవర్తి అతని వికెట్‌ను పడేశాడు. వన్‌డౌన్‌లో సూర్యకుమార్‌ వచ్చీ రాగానే మెరుపుల పని మొదలుపెట్టాడు. భజ్జీ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో స్క్వేర్‌ లెగ్, లాంగాన్, ఎక్స్‌ట్రా కవర్‌ల దిశగా మూడు బౌండరీలు బాదాడు. తిరిగి ప్రసిధ్‌ కృష్ణ వేసిన 8వ ఓవర్లో వరుసగా 6, 4, 4 కొట్టాడు. కమిన్స్‌ వేసిన పదో ఓవర్లో డీప్‌ స్క్వేర్‌లో కొట్టిన భారీ సిక్సర్‌తో సూర్యకుమార్‌ ఫిఫ్టీ 33 బంతుల్లోనే (6 ఫోర్లు, 2 సిక్స్‌లు) పూర్తయ్యింది. 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 81/1. ఇంతవరకు బాగానే ఉన్నా... రోహిత్‌ శర్మ క్రీజులో ఉన్నా... తర్వాత పరిస్థితి ఒక్కసారిగా దిగజారింది.  

దెబ్బతీసిన షకీబ్, కమిన్స్‌ 
షకీబుల్‌ హసన్‌ ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌ వేయగా రెండో బంతిని సూర్య బౌండరీకి తరలించాడు. తర్వాత బంతికి అదే ఊపులో భారీషాట్‌కు ప్రయత్నించి శుబ్‌మన్‌ చేతికి చిక్కాడు. మరుసటి ఓవర్లో కమిన్స్‌... ఇషాన్‌ కిషన్‌ (1)ను అవుట్‌ చేశాడు. దీంతో రోహిత్‌ చూసుకొని ఆడటంతో రన్‌రేట్‌ మందగించింది. 14వ ఓవర్లో స్కోరు వందకు చేరింది. రోహిత్‌ శర్మను కమిన్స్‌ బౌల్డ్‌ చేయడంతో పాటు రసెల్‌ బౌలింగ్‌ దిగడంతో ముంబై తడబడింది. హార్డ్‌ హిట్టర్లు హార్దిక్‌ పాండ్యా (15), పొలార్డ్‌ (5), కృనాల్‌ (15) కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తలవంచారు. దీంతో ఒక దశలో 86/1తో పటిష్టంగా కనిపించిన ముంబై 126/7తో నేలకు దిగింది. 152 పరుగుల వద్ద ఆలౌటైంది. 

రాణా రాణించినా... 
ముంబై నిర్దేశించిన లక్ష్యం ఏమంత కష్టంగా లేదు. 20 ఓవర్లు నిలబడి అడపాదడపా షాట్లు కొడితే గెలిచే లక్ష్యం. కోల్‌కతా ఓపెనర్లు రాణా, గిల్‌ ముందుగా నింపాదిగా బ్యాటింగ్‌ చేశారు. గతి తప్పిన బంతుల్ని బౌండరీలకు తరలించాడు. బౌల్ట్‌ మూడో ఓవర్లో రాణా కవర్‌లో సిక్సర్‌ బాదాడు. మరోవైపు గిల్‌ బౌండరీలపై దృష్టిపెట్టాడు. నితీశ్‌ రాణా... పొలార్డ్‌ బౌలింగ్‌లో డీప్‌మిడ్‌ వికెట్‌ దిశగా మరో సిక్స్‌ కొట్టాడు. శుబ్‌మన్‌ కూడా స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌ బౌలింగ్‌లో డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్స్‌ కొట్టాడు. ఇదే ఉత్సాహంతో మరో షాట్‌కు ప్రయత్నించిన గిల్‌కు చహర్‌ చెక్‌ పెట్టాడు. దీంతో 72 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యం చెదిరింది. చహర్‌ తన తదుపరి ఓవర్లలో వరుసగా రాహుల్‌ త్రిపాఠి (5), కెప్టెన్‌ మోర్గాన్‌ (7), నితీశ్‌ రాణాలను ఔట్‌ చేయడంతో ముంబై పట్టు బిగించింది. షకీబ్‌ (9) కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 15.2 ఓవర్లలో కోల్‌కతా 122 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. హార్డ్‌ హిట్టర్‌ రసెల్‌ క్రీజులోకి రాగా దినేశ్‌ కార్తీక్‌ జతగా ఉన్నాడు. అయితే ముంబై బౌలర్లు ఒత్తిడి పెంచారు. 16వ ఓవర్లో కృనాల్‌ ఒక పరుగు మాత్రమే ఇచ్చి వికెట్‌ తీశాడు. కానీ రసెల్‌ రిటర్న్‌ క్యాచ్‌ను నేలపాలు చేశాడు. 17వ ఓవర్లో బుమ్రా 8 పరుగులిచ్చినా... మరుసటి ఓవర్‌ వేసిన కృనాల్‌ 3 పరుగులే ఇచ్చి కవర్‌ చేశాడు. బుమ్రా తన నైపుణ్యాన్ని అంతా ఉపయోగించి వేసిన 19వ ఓవర్లో 4 పరుగులు ఇచ్చాడు. ఇక ఆఖరి 6 బంతుల్లో కోల్‌కతా విజయానికి 15 పరుగులు కావాలి. కానీ బౌల్ట్‌ మూడో బంతికి రసెల్‌ (9)ను రిటర్న్‌ క్యాచ్‌తో, నాలుగో బంతికి కమిన్స్‌ను క్లీన్‌ బౌల్డ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. చివరకు 4 పరుగులే ఇవ్వడంతో కోల్‌కతా 142/7 స్కోరు దగ్గరే ఆగిపోయింది. 

స్కోరు వివరాలు 
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బి) కమిన్స్‌ 43; డికాక్‌ (సి) త్రిపాఠి (బి) వరుణ్‌ 2; సూర్యకుమార్‌ (సి) గిల్‌ (బి) షకీబ్‌ 56; ఇషాన్‌ (సి) ప్రసిధ్‌ (బి) కమిన్స్‌ 1; హార్దిక్‌ పాండ్యా (సి) రసెల్‌ (బి) ప్రసిధ్‌ 15; పొలార్డ్‌ (సి) కార్తీక్‌ (బి) రసెల్‌ 5; కృనాల్‌ (సి) ప్రసిధ్‌ (బి) రసెల్‌ 15; జేన్సన్‌ (సి) కమిన్స్‌ (బి) రసెల్‌ 0; రాహుల్‌ చహర్‌ (సి) గిల్‌ (బి) రసెల్‌ 8; బుమ్రా (సి) షకీబ్‌ (బి) రసెల్‌ 0; బౌల్ట్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్‌) 152. 

వికెట్ల పతనం: 1–10, 2–86, 3–88, 4–115, 5–123, 6–125, 7–126, 8–150, 9–150, 10–152. 
బౌలింగ్‌: హర్భజన్‌ 2–0–17–0, వరుణ్‌ చక్రవర్తి 4–0–27–1, షకీబ్‌ 4–0–23–1, కమిన్స్‌ 4–0–24–2, ప్రసిధ్‌ 4–0–42–1, రసెల్‌ 2–0–15–5. 
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: రాణా (స్టంప్డ్‌) డికాక్‌ (బి) రాహుల్‌ చహర్‌ 57; గిల్‌ (సి) పొలార్డ్‌ (బి) రాహుల్‌ చహర్‌ 33; రాహుల్‌ త్రిపాఠి (సి) డికాక్‌ (బి) రాహుల్‌ చహర్‌ 5; మోర్గాన్‌ (సి) జేన్సన్‌ (బి) రాహుల్‌ చహర్‌ 7; షకీబ్‌ (సి) సూర్య (బి) కృనాల్‌ 9; దినేశ్‌ కార్తీక్‌ (నాటౌట్‌) 8; రసెల్‌ (సి అండ్‌ బి) బౌల్ట్‌ 9; కమిన్స్‌ (బి) బౌల్ట్‌ 0; హర్భజన్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 142. 
వికెట్ల పతనం: 1–72, 2–84, 3–104, 4–122, 5–122, 6–140, 7–140. 
బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–27–2, జేన్సన్‌ 2–0–17–0, బుమ్రా 4–0–28–0, కృనాల్‌ 4–0–13–1, పొలార్డ్‌ 1–0–12–0, రాహుల్‌ చహర్‌ 4–0–27–4, రోహిత్‌ 1–0–9–0. 

2–0–15–5 
ఆలస్యం అమృతం విషమన్నారు పెద్దలు. కానీ ఆలస్యం అద్భుతం ఆలౌట్‌ అన్నాడు రసెల్‌! అందరికంటే లేట్‌గా 18వ ఓవర్లో బౌలింగ్‌కు దిగిన రసెల్‌ ముంబైకి ముకుతాడు వేశాడు. డెత్‌ ఓవర్లలో పొలార్డ్, కృనాల్‌ పాండ్యాలాంటి హిట్టర్లున్న ముంబై ధనాధన్‌ బాదాలి. కానీ అలా జరగలేదు. కారణం రసెల్‌! 18వ ఓవర్లో ఒక వైడ్‌బాల్‌ వ్యవధిలో పొలార్డ్, జేన్సన్‌లను ఔట్‌ చేశాడు. మళ్లీ ఆఖరి ఓవర్‌ వేసిన అతను మొదటి 2 బంతులకు 4, 4 సమర్పించుకున్నాడు. తర్వాతి 2 బంతులకు కృనాల్, బుమ్రాలను పెవిలియన్‌ చేర్చాడు. ఆఖరి బంతికి రాహుల్‌ చహర్‌ను అవుట్‌ చేశాడు. ఇలా 12 బంతులేసి రసెల్‌ 5 వికెట్లు పడగొట్టేశాడు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు