చైనా కంపెనీ ప్రచారకర్తగా వ్యవహరించడంపై నెటిజన్ల ఆగ్రహం

9 Apr, 2021 16:53 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్‌ స్పాన్సర్‌గా ఉన్న ప్రముఖ చైనా మొబైల్‌ కంపెనీ వివోకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోహ్లికి ఉన్న క్రేజ్‌ తమ ఉత్పత్తుల ప్రమోషన్‌కు ఉపయోగపడుతుందని భావించిన సదరు సంస్థ  కోహ్లిని ప్రచాకర్తగా నియమించుకుంది. అయితే ఇండో-చైనా సరిహద్దుల్లో గతకొంత ​కాలంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కోహ్లి చైనా కంపెనీకి ప్రచాకర్తగా వ్యవహరించడమేంటని భారతీయ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 

చైనా కంపెనీ అయిన వివోకు ప్రచారకర్తగా ఉండేందుకు సిగ్గుందా? అని కోహ్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాల్వాన్ ఘటన సమయంలో దేశభక్తి చాటిన నువ్వు.. ఏడాది తిరగకుండానే వీర జవాన్ల మరణాలు మరిచిపోయావా? అంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో కోహ్లి చేసిన ట్వీట్‌ను అభిమానులు రీట్వీట్ చేసి మరీ నిలదీస్తున్నారు. కాగా, గతేడాది గాల్వాన్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో ఇరు దేశాలకు చెందిన సైనికలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. జవాన్ల మధ్య జరిగిన ముఖాముఖి పోరాటంలో తెలుగువాడైన కల్నల్‌ సంతోష్‌తో పాటు 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు.

అయితే, ఇదంతా జరిగి ఏడాది తిరక్కుండానే కోహ్లి చైనా కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడం, బీసీసీఐ తిరిగి వివోను టైటిల్‌ స్పాన్సర్‌గా కొనసాగించడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వాస్తవానికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం వివో బీసీసీఐతో 2018లో ఐదేళ్ల కాలానికి రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే గాల్వాన్ లోయలో ఉద్రిక్తతల కారణంగా దేశ ప్రజల్లో చైనా ఉత్పత్తులపై వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో 2020 సంవత్సరానికి మాత్రం బీసీసీఐ.. వివోతో భాగస్వామ్యాన్ని రద్దు చేసుకొని, ఐపీఎల్ 2020 సీజన్‌కు డ్రీమ్ 11ను టైటిల్ స్పాన్సర్‌గా నియమించుకుంది. ఇదిలా ఉండగా, కొద్ది గంటల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య చెన్నై వేదికగా ఐపీఎల్‌ 2021 సీజన్‌ తొలి మ్యాచ్‌ ప్రారంభంకానుంది.
చదవండి: ఫేస్‌ టు ఫేస్‌ ఫైట్‌లో ముంబైదే పైచేయి

మరిన్ని వార్తలు