వేలంలోనూ దూకుడు లేదు.. ఆటలోనూ లేదు

18 Apr, 2021 00:35 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్ 14 వ‌ సీజన్‌కు సంబంధించి ఫిబ్రవరిలో జరిగిన వేలంలో అత్యంత పొదుపు పాటించిన జట్టు ఏదైనా ఉందంటే అది సన్‌రైజర్స్‌ హైదరాబాదే. కేవలం ఆ వేలంలో సన్‌రైజర్స్‌ రూ. 3.80 కోట్లు మాత్రమే వెచ్చించింది. తన పర్స్‌లో ఉన్న రూ. 10.75 కోట్లలో ఒక వంతు మాత్రమే ఖర్చు చేసి అత్యంత పొదుపు పాటించింది.  ఫిబ్రవరిలో జరిగిన వేలంలో  కేదార్‌ జాదవ్‌, ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌, జగదీశ సుచిత్‌లను తీసుకుంది.

వీరిలో కేదార్‌కు రూ. 2 కోట్లు వెచ్చించగా, ముజీబ్‌కు రూ. 1.5 కోట్లు, సుచిత్‌కు రూ. 30 లక్షలు ఖర్చు పెట్టింది. ఆ సమయంలోనే సన్‌రైజర్స్‌ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కేదార్‌ జాదవ్‌ను పెట్టుకుని ఏం చేస్తారని సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో  హోరెత్తారు.  సీఎస్‌కే వద్దనుకున్న ఆటగాడిని, అందులోనూ తరచూ విఫలమయ్యే కేదార్‌ను తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. 

దాదాపు అన్ని జట్లు సమూల మార్పులతో కాకపోయినా ఎంతో కొంత మంచి ప్లేయర్స్‌ను ఈసారి వేలంలో తీసుకుంది. సన్‌రైజర్స్‌ విషయంలో అది జరగలేదు. ఏదో వేలానికి వెళ్లి ఎవరో ఒకర్ని కొనుగోలు చేస్తే సరిపోతుందనే భావనే కనబడింది. అది వారి ఇష్టమే కావొచ్చు.. కానీ అది ఇప్పుడు ప్రభావం చూనిస్తోంది. అసలు సన్‌రైజర్స్‌ జట్టులో ఎక్స్‌పీరియన్స్‌ ఆటగాళ్లు ఎవరున్నారనే ప్రశ్న తలెత్తోంది.

డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టో, మనీష్‌ పాండేలు విఫలమైతే ఆ జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. విజయ్‌ శంకర్‌కు కాస్త అనుభవం ఉన్నా మ్యాచ్‌ను గెలిపించేలా ఆడలేకపోతున్నాడు. దాంతో ఆరెంజ్‌ ఆర్మీలో అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ముంబైతో శనివారం జరిగిన మ్యాచ్‌లో పవర్‌ ప్లేలో 57 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌ జట్టు.. 150 పరుగులు ఛేదనలో తడబడి ఓటమి పాలైందంటే అది అనుభవం లేకపోవడం ఒకటైతే, మ్యాచ్‌ ఫినిష్‌ర్‌లు లేకపోవడం మరొకటి. ఇంకా చెన్నైలో రెండు మ్యాచ్‌లు ఉన్న నేపథ్యంలో వార్నర్‌ సేన ఎలా రాణిస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలు