ఐపీఎల్‌ 2021: ఆసీస్‌ క్రికెటర్లకు షాక్‌

4 May, 2021 18:06 IST|Sakshi

మీరు రాకండి.. భారత్‌లోనే ఉండండి: సీఏ

మెల్‌బోర్న్‌:  ఐపీఎల్‌ ఆడటానికి భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు షాక్‌ తగిలింది. విమానాల నిషేధం అనేది పూర్తయ్యేవరకూ స్వదేశానికి అనుమతించబోమని క్రికెటర్లకు క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) స్పష్టం చేసింది. దాంతో ఎవరూ ఇక్కడకు రావొద్దని సూచించింది. నిషేధం ముగిసేవరకూ భారత్‌లోనే ఉండాలని క్రికెటర్లకు తెలిపింది. ప్లేయర్ల కోసం ప్రత్యేక అనుమతులు అనేవి లేవని, ప్రభుత్వం కఠిన నిబంధనలను మే 15 వరకూ అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. అప్పటివరకూ క్రికెటర్లను దేశంలోకి అనుమతించబోమని సీఏ తెలిపింది. 

దీనిపై ఆస్ట్రేలియా పీఎం మోరిసన్‌ నైన్‌ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ..  నిషేధం అమల్లో ఉన్న సమయంలో భారత్‌ నుంచి వచ్చే ఎవరికైనా జరిమానా లేదా జైలు అనేది ఒ​కే రకంగా ఉంటుందని హెచ్చరించారు. ఇక్కడ ఆస్ట్రేలియన్లకు కూడా ఇదే వర్తిస్తుందన్నారు. ఇక నిషాధాన్ని సమర్ధించుకున్నారు.  ఇక తమ దేశ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ స్లేటర్‌ చేసిన ‘బ్లడ్‌ ఆన్‌ యువర్‌ హ్యాండ్స్‌‘వ్యాఖ్యలపై  మోరిసన్‌ స్పందిస్తూ.. అది అర్థం లేని వ్యాఖ్య అని కొట్టి పారేశారు.

ఆస్ట్రేలియా క్రికెటర్లను స్వదేశానికి తీసుకురావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక విమానాలు వేయమని, మీరే సొంత ఖర్చులు పెట్టుకుని రావాలని కఆ దేశం పీఎం మోరిసన్‌ కొన్ని రోజుల క్రితమే స్పష్టం చేశారు.  అదే సమయంలో నిషేధం అమల్లో ఉన్న సమయంలో ఎవరినీ దేశంలోకి అనుమతించమన్నారు. దీనిపై ఆసీస్‌ మాజీ క్రికెటర్‌, ప్రముఖ  కామెంటేటర్‌ మైకేల్‌ స్లేటర్‌ ధ్వజమెత్తాడు. ఇలా మీ దేశ పౌరుల్ని వదిలేస్తారా.. మీకెంత ధైర్యం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

ఈమేరకు ట్వీటర్‌ ద్వారా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మీరు మమ్మల్ని స్వదేశానికి రప్పించే చర్యలు చేపట్టకపోతే అంతకంటే దారుణం ఇంకొటి ఉండదు. మాకు ఏది జరిగినా దానికి మీరే కారణం అవుతారు. మమ్మల్ని చిన్నచూపు  చూడటానికి మీకెంత ధైర్యం. క్వారంటైన్‌ సిస్టమ్‌ను ఎలా పరిష్కరిస్తారు. నేను గవర్నమెంట్‌ అనుమతితోనే ఐపీఎల్‌లో పని చేయడానికి ఇక్కడికి వచ్చా. కానీ గవర్నమెంట్‌ నిర్లక్ష్యానికి గురవుతున్నా’ అంటూ ట్వీటర్‌ వేదికగా స్లేటర్‌ మండిపడ్డాడు. మీ చేతికి రక్తం అంటింది అంటూ మరో అడుగు ముందుకేసీ మరీ మోరిసన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు