‘అశ్విన్‌కు బౌలింగ్‌ ఎందుకు ఇవ్వలేదో అడుగుతా’

16 Apr, 2021 14:20 IST|Sakshi
Photo courtesy: BCCI/IPL

ముంబై: రాజస్తాన్‌ రాయల్స్‌ జరిగిన మ్యాచ్‌లో ఓటమి చెందడంపై ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ అసహనం వ్యక్తం చేశాడు. గెలుపు అంచుల వరకూ వెళ్లి పరాజయం చెందడం జట్టు తప్పిదంగా పాంటింగ్‌ పేర్కొన్నాడు. ప్రధానంగా చివరి ఓవర్‌లో మోరిస్‌కు వేసిన రెండు బంతుల్ని స్లాట్‌ వేశారని, దాంతోనే మ్యాచ్‌ తమ చేతుల్లోంచి చేజారిపోయిందన్నాడు. ఎవరికైనా బంతుల్ని స్లాట్‌లో వేస్తే కచ్చితంగా హిట్‌ చేస్తారన్నాడు. అందులోనూ చావో రేవో పరిస్థితుల్లో ఈ తరహా బంతులు సరైనది కాదని పాంటింగ్‌ అన్నాడు.

మ్యాచ్‌ తర్వాత పోస్ట్‌ మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన పాంటింగ్‌.. టామ్‌ కరాన్‌ వేసిన ఆ రెండు బంతులు తమ జట్టుకు విజయాన్ని దూరం చేశాయని తేల్చేశాడు. ఇషాంత్ స్థానాన్ని అవేష్ ఖాన్ పూర్తి స్థాయిలో భర్తీ చేస్తాడని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఇషాంత్ అనుభవం జట్టుకు అవసరమొస్తుందని అభిప్రాయపడ్డాడు. క్రిస్ వోక్స్, కగిసో రబడ, నోర్ట్‌జే, టామ్ కుర్రన్‌లతో బౌలింగ్ విభాగం బలంగా ఉందని, రవిచంద్రన్ అశ్విన్ రూపంలో నాణ్యమైన స్పిన్నర్ జట్టులో ఉన్నాడని చెప్పాడు. 

అశ్విన్‌కు బౌలింగ్‌ ఎందుకు ఇవ్వలేదో అడుగుతా
మ్యాచ్‌ చేజారిపోవడానికి ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు బౌలింగ్‌ ఇవ్వకపోవడం కూడా ఒక కారణమన్నాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో అశ్విన్‌ అద్భుతమైన గణాంకాలతో బౌలింగ్‌ చేస్తే అతని చేత పూర్తి కోటా బౌలింగ్‌ వేయించకపోవడం నిజంగానే తప్పిదమన్నాడు. తాము ఆడిన తొలి గేమ్‌లో అశ్విన్‌ నిరాశపరిస్తే, రెండో గేమ్‌  నాటికి సెట్‌ అయ్యాడన్నాడు.

తొలి గేమ్‌ నుంచి చేసిన తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకుని, రాజస్థాన్‌తో మ్యాచ్‌లో చాలా పొదుపుగా బౌలింగ్‌ చేశాడని పాంటింగ్‌ తెలిపాడు. మరి అటువంటప్పుడు అశ్విన్‌ చేత పూర్తి కోటా బౌలింగ్‌ వేయించకపోవడం తప్పిదమే అవుతుందన్నాడు. ఈ విషయంపై జట్టు సభ్యులతో కూర్చొని మాట్లాడతానని, దీనిపై ఒక క్లారిటీ తీసుకోవాలని పాంటింగ్‌ అన్నాడు. తాము బౌలింగ్‌ చేసేటప్పుడు బంతిపై గ్రిప్‌ దొరకలేదని, అందుకే బౌలర్లు అనుకున్న విధంగా బౌలింగ్‌ చేయలేకపోయారన్నాడు. తమ ఫలితంపై డ్యూ కూడా ప్రభావం చూపిందని పాంటింగ్‌ స్పష్టం చేశాడు. 

ఇక్కడ చదవండి: ఢిల్లీ ఓటమి: పంత్‌ మిస్టేక్‌ వెరీ క్లియర్‌..!
సామ్సన్‌.. నా బ్యాటింగ్‌ చూడు!
Chris Morris: ఇజ్జత్‌ అంటే ఇదేనేమో.. వెల్‌డన్‌ మోరిస్‌!

>
మరిన్ని వార్తలు