ధోని ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌..

8 Apr, 2021 18:11 IST|Sakshi

ముంబై: చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్‌ అన్న పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఫ్రాంఛైజీ యాజమాన్యం స్పందించింది. ధోనిలో అత్యుత్తమ క్రికెట్‌ ఆడగలిగే సత్తా ఇంకా ఉందని, అతను మరిన్ని ఐపీఎల్‌లు ఆడగలడని, ఐపీఎల్‌ 2021 కచ్చితంగా అతనికి ఆఖరి ఐపీఎల్‌ కాబోదని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వ‌నాథ‌న్ ప్రకటించాడు. అయితే ఇది పూర్తిగా నా వ్య‌క్తిగ‌త అభిప్రాయమని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి తాము ధోని ప్రత్యామ్నాయం గురించి ఆలోచించట్లేదని, మున్ముందు కూడా ఆ ఆలోచన చేసే అవకాశం రాకపోవచ్చని ఆయన స్పష్టం చేశాడు. కాగా, ధోని ఇటీవలే అంతార్జతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా, జట్టులోని మ‌రో ఇద్ద‌రు ముఖ్య‌ ఆట‌గాళ్ల గురించి కూడా కాశీ విశ్వ‌నాథ‌న్ స్పందించాడు. రైనా, జడేజాల రూపంలో తమ జట్టులో ఇద్దరు భారీ హిట్టర్లు ఉన్నారని, వారు రానున్న సీజన్‌లో కుర్రాలతో పోటీపడి మరీ పరుగులు సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశాడు. జ‌డేజా ఫిట్‌నెస్‌ సమస్యలతో బాధపడుతున్నప్పటికీ.. దాని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని, అతను ఫిట్‌గా ఉన్నాడ‌ని ఎన్‌సీఏనే స్వయంగా చెప్పిందని పేర్కొన్నాడు. ప్రస్తుతం జడేజా జట్టుతో చేరాడని, తమ తొలి మ్యాచ్‌లోపు అత‌ను పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడ‌ని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు రైనా గ‌త ప‌ది రోజులుగా జట్టుతో పాటే ప్రాక్టీస్ చేస్తున్నాడ‌ని, ఈ సీజ‌న్‌లో త‌న‌ను తాను ప్రూవ్ చేసుకోవ‌డానికి ఆరాట‌ప‌డుతున్నాడని తెలిపాడు.
చదవండి: ఆర్‌సీబీతో ఫేస్‌ టు ఫేస్‌ ఫైట్‌లో ముంబైదే పైచేయి

>
మరిన్ని వార్తలు