నన్ను బాధించింది.. ఇక ఆలోచించడం లేదు: పృథ్వీ షా

11 Apr, 2021 17:43 IST|Sakshi
పృథ్వీ షా(ఫోటో కర్టసీ: బీసీసీఐ)

ముంబై:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీ షా ఆడిన తీరు తన టెక్నిక్‌ను మెరుగుపరచున్నట్లే కనబడింది. మంచి టాలెంట్‌ ఉన్న ఆటగాడైనా బ్యాటింగ్‌ టెక్నిక్‌లో చిన్న చిన్న లోపాల వల్ల వికెట్‌ను పృథ్వీ షా త్వరగా సమర్పించుకుంటాడనే అపవాదు ఉంది. ఇప్పుడు దానిపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు పృథ్వీ స్పష్టం చేశాడు. సీఎస్‌కేతో  మ్యాచ్‌లో 38 బంతుల్లో 9ఫోర్లు, 3 సిక్స్‌లతో 72 పరుగులు సాధించిన పృథ్వీ షా.. ఢిల్లీ విజయం సాధించడంలో కీలక భూమిక పోషించాడు. మ్యాచ్‌ తర్వాత తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన పృథ్వీ షా.. తన బ్యాటింగ్‌ టెక్నిక్‌లో లోపాలు వాటిని సరిచేసుకోవడంపైనే దృష్టి పెట్టినట్లు తెలిపాడు. 

దీనిలో భాగంగా భారత క్రికెట్‌లో చోటు కోల్పోవడం బాధించిందా అని విలేకరి అడిగిన ప్రశ్నకు పృథ్వీ షా సమాధానమిస్తూ.. ‘ నేను ప్రస్తుతం టీమిండియా జట్టులో చోటు కోసం ఆలోచించడం లేదన్నాడు.  ఎందుకు తీసేశారు అనే విషయాన్నిపట్టించుకోలేదు. కూడా ఆస్ట్రేలియా పర్యటన నుంచి నేను భారత జట్టుకు దూరమయ్యాను. అది నాకు నిరాశ కల్గించడమే కాకుండా బాధించింది. దాంతో నా బ్యాటింగ్‌పై ఫోకస్‌ చేశా. త్వరగానే నేను నా తప్పిదాలను సరిచేసుకున్నా. విజయ్‌ హజారే ట్రోఫీకి వెళ్లే ముందు ప్రవీణ్‌ ఆమ్రే నా టెక్నిక్‌ను సరిచేశారు. అది లాభించింది. దాంతో ఒక మంచి ప్రణాళికతో ఆ టోర్నీకి వెళ్లాను.  

నేను టీమిండియాకు దూరం కావడం నాలో నిరాశను తీసుకొచ్చింది. ఒకవేళ నా బ్యాటింగ్‌ టెక్నిక్‌లో తప్పులు  ఉంటే వాటిని సరిచేసుకోవాలి. అందుకోసం నా శాయశక్తులా ప్రయత్నిస్తా. నా పని నేను చేసుకుపోతా.. భారత జట్టులో చోటు కోసం ఆలోచించడం లేదు’ అని పృథ్వీ షా తెలిపాడు. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఘన విజయాన్ని అందుకుంది.  ఓపెనర్‌ పృథ్వీ షాకు తోడు ధవన్‌ 54 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో  85 పరుగులతో రాణించాడు. ఈ ఇద్దరు ఓపెనర్లు ఆరంభం నుంచే బ్యాట్‌ ఝుళిపించడంతో ఢిల్లీ అవలీలగా గెలుపును సాధించింది.  ముందుగా సీఎస్‌కే బ్యాటింగ్‌ చేయగా 188 పరుగులు చేసింది. రైనా(54), మొయిన్‌ అలీ(36),  సామ్‌ కరాన్‌(34)లు   దాటిగా ఆడగా, రాయుడు(23), రవీంద్ర జడేజా(26 నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. 

మరిన్ని వార్తలు