IPL 2021: ఢిల్లీ పగ్గాలు పంత్‌కే.. శ్రేయస్‌కు భంగపాటు

3 Sep, 2021 15:30 IST|Sakshi

దుబాయ్‌: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రిషబ్‌ పంత్‌ను సారధ్య బాధ్యతల్లో యధావిధిగా కొనసాగించాలని ఢిల్లీ  యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. యూఏఈ వేదికగా ఈనెల 19 నుంచి జరిగే ఐపీఎల్‌ మలి దశ మ్యాచ్‌లకు పంత్‌ను తప్పించి, శ్రేయస్‌ అయ్యర్‌కు తిరిగి కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో డీసీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. భుజం గాయం కారణంగా గత కొంతకాలంగా క్రికెట్‌ దూరంగా ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌కు కెప్టెన్సీ అప్పగించి ప్రయోగం చేయదలచుకోలేదని ప్రకటించింది. ప్రస్తుతం శ్రేయస్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని, ఆటగాడిగా జట్టుకు సేవలందిస్తాడని స్పష్టం చేసింది. 

కాగా, గాయం కారణంగా భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ మొదటి దశ మ్యాచ్‌లకు శ్రేయస్ దూరం కావడంతో పంత్‌ డీసీ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. పంత్‌ సారధ్యంలో డీసీ తొలి దశ మ్యాచ్‌లలో వరుస విజయాలు(8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు) సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు గత రెండున్నర సీజన్లుగా డీసీ జట్టును శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుతంగా ముందుండి నడిపించాడు. అతని సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ గతేడాది ఫైనల్స్‌కు కూడా చేరింది. ఇదిలా ఉంటే, డీసీ జట్టు ఐపీఎల్‌ సెకెండ్‌ లెగ్‌ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 22న సన్‌రైజర్స్‌తో ఆడనుంది. 
చదవండి: అన్నీ మాకు సానుకూలాంశాలే, టీమిండియా​ను కచ్చితంగా ఓడిస్తాం..పాక్‌ కెప్టెన్ ధీమా

మరిన్ని వార్తలు