అదీ కెప్టెన్‌ అంటే: కోహ్లి చేసిన పనికి నెటిజన్లు ఫిదా!

1 May, 2021 10:50 IST|Sakshi
Photo Courtesy: IPL Twitter

అహ్మదాబాద్‌: ఒక్క మ్యాచ్‌తో క్రీడా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిపోయాడు పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ హర్‌ప్రీత్‌ బ్రార్‌. శుక్రవారం రాయల్‌ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించిన సంగతి తెలిసిందే. తన స్పిన్నింగ్‌ మాయాజాలంతో ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(35), స్టార్‌ హిట్టర్లు గ్లెన్‌ మాక్స్‌వెల్‌(0), ఏబీ డివిలియర్స్‌(3)ను పెవిలియన్‌కు పంపి పంజాబ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవడంతో పాటు ఐపీఎల్‌లో తొలి వికెట్‌గా కోహ్లిని అవుట్‌ చేయడం ద్వారా ఈ మ్యాచ్‌ను మరింత మెమరబుల్‌గా మార్చుకున్నాడు.

ఈ క్రమంలో మ్యాచ్‌ ముగిసిన తర్వాత హర్‌ప్రీత్‌ బ్రార్‌ను విరాట్‌ కోహ్లి ప్రత్యేకంగా అభినందించాడు. నవ్వుతూ కరచాలనం చేసి అతడి భుజం తట్టి ప్రోత్సహించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ‘‘తొలి వికెట్‌.. పైగా అతడి నుంచి ప్రశంసలు.. బ్రార్‌కు ఇది కచ్చితంగా గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం అవుతుంది’’ అంటూ కామెంట్‌ జతచేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో కోహ్లి ఫ్యాన్స్‌తో పాటు పంజాబ్‌ అభిమానులు కూడా రన్‌మెషీన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

‘‘లెజెండ్స్‌ ఇలాగే యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తారు. క్రీడాస్ఫూర్తి అంటే ఇదే. అద్భుతమైన బౌలింగ్‌తో తనను అవుట్‌ చేసిన యువ బౌలర్‌ను అభినందించడం ద్వారా కోహ్లి మరోసారి మా మనసులు గెల్చుకున్నాడు. బెస్ట్‌ కెప్టెన్‌ నువ్వు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అదే విధంగా, హర్‌ప్రీత్‌ బ్రార్‌ను కూడా ఆల్‌ ది బెస్ట్‌ అంటూ విషెస్‌ చెబుతున్నారు.   

స్కోర్లు: పంజాబ్‌-179/5 (20)
ఆర్సీబీ- 145/8 (20)

చదవండి: RCB Vs PBKs: పంజాబ్‌కు ‘ప్రీత్‌’పాత్ర విజయం

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు