CSK Vs MI: సీఎస్‌కే ప్రతీకారం తీర్చుకుంటుందా? లేదంటే మరోసారి..

18 Sep, 2021 17:16 IST|Sakshi
Photo Courtesy: CSK Twitter

IPL 2021 Phase 2 CSK Vs MI: క్రికెట్‌ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్‌-2021 రెండో అంచె రేపటి నుంచి ఆరంభం కానుంది. కోవిడ్‌ కారణంగా ఆకస్మికంగా వాయిదా పడిన క్యాష్‌ రిచ్‌ లీగ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో పునః ప్రారంభం కాబోతుంది. మరి.. ఈ మ్యాచ్‌లో ధోని సేన ఎలా ఆడబోతోంది? మే 1న జరిగిన లీగ్‌ 27వ మ్యాచ్‌లో భాగంగా ముంబై చేతిలో ఓడిన ధోని సేన ప్రతీకారం తీర్చుకుంటుందా? 

అపఖ్యాతి చెరిపేసుకుని.. 
ఐపీఎల్‌-2020 సీజన్‌లో సీఎఎస్‌కే దారుణమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. మెగా టోర్నీ ఆరంభానికి ముందే ఆటగాళ్లు కరోనా బారిన పడటం.. సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్‌ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఆదిలోనే జట్టుకు దూరమవడం తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా ఎన్నడూ లేని విధంగా సీఎస్‌కేను వరుస ఓటములు వెంటాడాయి. తమ స్థాయికి తగ్గట్లు ఆడలేక... పేలవ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్ల ముందు ధోని సేన తలవంచింది. 

ఈ క్రమంలో ఐపీఎల్‌- 2020 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ దశలోనే నిష్క్రమించిన తొలి జట్టుగా చెన్నై అపఖ్యాతి మూటగట్టుకుంది. ధోని సారథ్యంలో మూడుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా, దాదాపు ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచిన సూపర్‌కింగ్స్‌ లీగ్‌ దశలోనే వెనుదిరగడం ఐపీఎల్‌ చరిత్రలోనే మొట్టమొదటిసారి. అయితే, ఆ చేదు అనుభవాల నుంచి త్వరగానే కోలుకుని.. ఐపీఎల్‌-2021 తొలి దశలో అదరగొట్టింది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో 7 వికెట్ల తేడాతో ఘోర ఓటమి పాలైనప్పటికీ.. పడిలేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగిసింది.

వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి.. సత్తా చాటింది. అత్యధిక రన్‌రేటుతో దూసుకుపోయింది. అయితే, ఫస్ట్‌ ఫేజ్‌(కరోనా కారణంగా వాయిదా పడే నాటికి)లో తమ చివరి మ్యాచ్‌లో మాత్రం ముంబై చేతిలో ధోని సేనకు ఓటమి తప్పలేదు. రోహిత్‌ వ్యూహాల ఫలితంగా డిఫెండింగ్‌ చాంపియన్‌ నాలుగు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్‌లో చెన్నై ప్రతీకారం తీర్చుకుంటుందా లేదంటే మరోసారి చేతులెత్తేస్తుందా అన్న అంశం ఆసక్తికరంగా మారింది.
చదవండి: IPL 2021 Phase 2: ఐపీఎల్‌ సెకండ్‌ ఫేజ్‌లో దూరమైన ఆటగాళ్లు ఎవరో తెలుసా ?

ధోని మెరుపులు చూడగలమా.. జట్టులో మార్పులు ఏమున్నాయి?
ఫస్ట్‌ ఫేజ్‌లో కెప్టెన్‌ ధోనికి ఎక్కువగా బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. దీంతో హెలికాప్టర్‌ షాట్ల కోసం ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు  కేవలం 37 పరుగులు మాత్రమే చేసిన మిస్టర్‌ కూల్‌.. తాజా ప్రాక్టీసు సెషన్‌లో మాత్రం అదరగొట్టాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో.. రెండో అంచెలో తలా మెరుపులు చూడటం ఖాయమని సీఎస్‌కే ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. 

హాజిల్‌వుడ్‌ అందుబాటులోకి..
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన చెన్నై 5 విజయాలు.. రెండు పరాజయాల(ఢిల్లీ, ముంబై)తో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. అయితే, ఆ రెండు మ్యాచ్‌లలో కూడా ధోని సేన చెప్పుకోదగ్గ స్థాయిలోనే స్కోరు చేసింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 188(నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి) పరుగులు చేసిన సీఎస్‌కే.. ముంబైతో ఆడిన మ్యాచ్‌లో 218(20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి) చేసింది. అయితే, మెరుగైన స్కోరు సాధించినప్పటికీ బౌలర్ల వైఫల్యం కారణంగానే ఓటమి పాలైందని చెప్పవచ్చు.

ఆల్‌రౌండర్లను ఎక్కువగా బరిలోకి దింపే చెన్నై.. కాస్త వ్యూహాన్ని మారిస్తే గెలుపు సులువేనన్నది క్రీడా విశ్లేషకుల అభిప్రాయం. ఇక రెండో అంచెలో పెద్దగా మార్పులేమీ లేకుండానే మైదానంలో దిగే అవకాశం ఉంది. కాగా తొలి దశకు అందుబాటులో లేని ఆసీస్‌ బౌలర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ ఈ అంచెకు అందుబాటులోకి రానున్నాడు.  

సీఎస్‌కే తుది జట్టు అంచనా: రాబిన్‌ ఊతప్ప, రుతురాజ్‌ గైక్వాడ్‌, మొయిన్‌ అలీ, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), రవీం‍ద్ర జడేజా, డ్వేన్‌ బ్రావో, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహర్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌.
-వెబ్‌డెస్క్‌

చదవండి: T20 World Cup 2021: సెమీస్‌ చేరే జట్లు ఇవే.. నాలుగో స్థానం కోసం వాటి మధ్య పోటీ!
 

మరిన్ని వార్తలు