DC vs SRH: ఒత్తిడిలో కేన్‌ మామ సేన.. జోరు మీద ఢిల్లీ.. విజయం ఎవరిది?

22 Sep, 2021 17:09 IST|Sakshi
Photo: IPL

IPL 2021 Phase 2 SRH Vs DC: ఐపీఎల్‌-2021 సీజన్‌ రెండో అంచెలో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. కోవిడ్‌ కారణంగా క్యాష్‌ రిచ్‌లీగ్‌ వాయిదా పడే నాటికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌, పేలవ ప్రదర్శనతో చతికిలపడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య బుధవారం మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ముఖాముఖి పోరు, బలాలు, బలహీనతలు.. తాజా మ్యాచ్‌లో గెలుపు అవకాశాలను పరిశీలిద్దాం.

వారిదే పైచేయి!
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌ 19 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో 11 సార్లు హైదరాబాద్‌నే విజయం వరించింది. ఢిల్లీ ఎనిమిది సార్లు గెలుపొందింది. అంతేకాదు, యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌ గ్రూపు స్టేజ్‌లో కూడా ఎస్‌ఆర్‌హెచ్‌దే పైచేయిగా నిలిచింది. కానీ, కీలకమైన క్వాలిఫైయర్‌-2 ప్లే ఆఫ్స్‌లో మాత్రం ఢిల్లీ గెలిచి ఫైనల్‌ చేరి సత్తా చాటింది.

ఇక ఐపీఎల్‌ తాజా సీజన్‌ తొలి అంచెలో చెన్నైలో జరిగిన ఢిల్లీ- హైదరాబాద్‌ మ్యాచ్‌ టై కావడంతో.. సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా పంత్‌ సేనకు గెలుపు దక్కింది. గతంలో సన్‌రైజర్స్‌ మెరుగైన రికార్డే కలిగి ఉన్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం పంత్‌ సేనదే పైచేయిగా కనిపిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లలో ఢిల్లీ ఆరింటిలో గెలుపొంది పటిష్ట స్థితిలో ఉండగా... హైదరాబాద్‌ ఆడిన 7 మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌ జట్టుగా ఢిల్లీ బరిలోకి దిగనుంది.

బలం- బలహీనత.. వార్నర్‌ను ఆడిస్తేనే..
తొలి దశను గమనిస్తే సన్‌రైజర్స్‌ నిలకడలేమి ఆటతో సతమతమైన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మ్యాచ్‌ మ్యాచ్‌కు ఆటగాళ్లను పదే పదే మార్చడం.. కీలక ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడమే గాక.. తుది జట్టులో చోటు కల్పించకపోవడం వంటి అంశాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయని చెప్పవచ్చు.

ఫలితంగా ఏడింటిలో ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌ మాత్రమే గెలవగలింది. ఇక ఇప్పుడు బెయిర్‌స్టో స్థానంలో రూథర్‌ఫోర్డ్‌ జట్టులోకి వచ్చాడు. వృద్ధిమాన్‌ సాహాతో పాటు స్టార్‌ ప్లేయర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఓపెనింగ్‌ చేసి, బ్యాట్‌ ఝులిపిస్తేనే మెరుగైన ఫలితాలు చూడవచ్చు. ఇక కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మెరుగ్గా ఢిల్లీ క్యాపిటల్స్‌
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అద్భుతంగా రాణించిన పంత్‌ సేన.. రెండో అంచెలో శుభారంభం చేయాలని భావిస్తోంది. గాయం కారణంగా తొలి దశకు దూరమైన మాజీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తిరిగి జట్టుతో చేరడం సానుకూల అంశం. అతడి రాకతో ఢిల్లీ బ్యాటింగ్‌ లైనప్‌ మరింత దృఢంగా మారిందని చెప్పవచ్చు. విదేశీ ఆటగాళ్లలో మరో బౌలర్‌కు అవకాశం దక్కే ఛాన్స్‌ కూడా ఉంటుంది. అన్ని విభాగాల్లోనూ ఢిల్లీ పటిష్టంగానే కనిపిస్తోంది.

అన్ని మ్యాచ్‌లు గెలవాల్సిందే!?
ఈ మ్యాచ్‌ విషయాన్ని పక్కన పెడితే.. లీగ్‌లో కొనసాగాలంటే కేన్‌ మామ సేన కచ్చితంగా వరుస మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు తోడు నేటి మ్యాచ్‌కు ముందు ఆ జట్టు ఆటగాడు నటరాజన్‌కు కోవిడ్‌ సోకడం ఎస్‌ఆర్‌హెర్‌ క్యాంపులో కలవరం రేపుతోంది. ఏదేమైనా... ఒత్తిడిలో ఉన్న సన్‌రైజర్స్‌ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప గెలవడం కాస్త కష్టంగానే కనిపిస్తోంది. అయితే, కీలక బ్యాట్స్‌మెన్‌ వార్నర్‌ మెరుపులకు తోడు.. బౌలర్‌ భువీ వ్యూహాలు పక్కాగా అమలైతే హైదరాబాద్‌ను ఆపడం ఎవరితరం కాదనే విషయం గతంలో ఎన్నోసార్లు నిరూపితమైన సంగతి తెలిసిందే.

తుదిజట్ల అంచనా:
ఢిల్లీ క్యాపిటల్స్‌:
పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, స్టీవెన్‌ స్మిత్‌/హెట్‌మెయిర్‌, రిషభ్‌ పంత్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), మార్కస్‌ స్టొయినిస్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, కగిసొ రబడ, అన్రిచ్‌ నోర్టే‍్జ, ఆవేశ్‌ ఖాన్‌.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:
డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), వృద్ధిమాన్‌ సాహా, మనీశ్‌పాండే, విజయ్‌ శంకర్‌, మహ్మద్‌ నబీ/షెర్పానే రూథర్‌ఫోర్డ్‌/జేసన్‌ హోల్డర్‌, అబ్దుల్‌ సమద్‌, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌.

చదవండి: Rishabh Pant: అతడిపై ఒత్తిడి సహజం.. ఇక కెప్టెన్‌గా.. : మంజ్రేకర్‌

Poll
Loading...
Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు