IPL 2021: ఎప్పుడు నిర్వహిద్దాం?

29 May, 2021 01:45 IST|Sakshi

నేడు బీసీసీఐ ఎస్‌జీఎంలో కీలక నిర్ణయం

ముంబై: కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌–2021లో మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న బీసీసీఐ నేడు దీనిపై మరింత స్పష్టత ఇవ్వనుంది. శనివారం జరిగే బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో ఐపీఎల్‌ తేదీలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. లీగ్‌ జరగకపోతే భారీగా ఆర్థిక నష్టాలు చవిచూసే ప్రమాదం ఉండటంతో ఎస్‌జీఎంలో ఇదే ప్రధాన అజెండాగా బోర్డు సభ్యులు పాల్గొనబోతున్నారు. అయితే లీగ్‌ మిగిలిన భాగం భారత్‌లో జరగదని మాత్రం తేలిపోయింది. యూఏఈ వేదికగా టోర్నీ నిర్వహించడం దాదాపు ఖాయమైంది. ‘రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున పది రోజులు, ఏడు రోజుల పాటు రోజూ ఒక్కో మ్యాచ్‌ జరిపి మిగిలిన నాలుగు ప్లే ఆఫ్‌లను కూడా వారాంతంలో నిర్వహిస్తే మేం అనుకున్న తేదీల్లో లెక్క సరిపోతుంది. ఇప్పుడు కావాల్సింది దీనికి అధికారికంగా ఆమోదముద్ర వేయడమే’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.   

టి20 వరల్డ్‌కప్‌పై వేచి చూడండి...
ఎస్‌జీఎంలో మరో ప్రధానాంశం టి20 వరల్డ్‌ కప్‌ నిర్వహణ. అక్టోబర్‌–నవంబర్‌ మధ్య ఈ టోర్నీ భారత్‌లో జరగాల్సి ఉండగా మన దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ కూడా వస్తుందంటున్న నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నారు. అయితే దీనిని మరో దేశానికి తరలించే విషయంలో తొందరపాటు ప్రదర్శించవద్దని, తగినంత సమయం ఉంది కాబట్టి కొన్నాళ్లు ఆగి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఐసీసీని ఈ సమావేశం ద్వారా బీసీసీఐ కోరనుంది. మరోవైపు ఎనిమిది జట్లతో ఐపీఎల్‌ నిర్వహించలేని స్థితి ఉండగా, 16 జట్లతో ప్రపంచకప్‌ ఎలా జరుపుతారనే దానిపై కూడా చర్చ సాగవచ్చు. వీటితో పాటు రంజీ ట్రోఫీ రద్దు కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న సుమారు 700 మంది దేశవాళీ క్రికెటర్లకు ఎలా నష్టపరిహారం అందించాలనే అంశాన్ని కూడా ఎస్‌జీఎం అజెండాలో చేర్చారు.

మరిన్ని వార్తలు