-

IPL 2021 Phase 2: అతనొక్కడే.. ఆర్సీబీ ఇంతవరకు టైటిల్‌ గెలవలేదు కాబట్టి..

16 Sep, 2021 15:06 IST|Sakshi
విరాట్‌ కోహ్లి(ఫొటో: ఐపీఎల్‌)- గౌతం గంభీర్‌

Gautam Gambhir Comments On AB De Villiers: జట్టులో స్టార్‌ ఆటగాళ్లు ఉన్నప్పటికీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇంతవరకు ఒక్కసారి కూడా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కప్‌ గెలవలేకపోయింది. 2016లో ఫైనల్‌ చేరినప్పటికీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముందు తలవంచిన కోహ్లి సేన.. ఈ తర్వాత సీజన్లలో కూడా ప్లేఆఫ్‌ చేరేందుకు కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక గత సీజన్‌లో లీగ్‌ దశలో టాప్‌-4లో నిలిచిన ఆర్సీబీ.. నాకౌట్‌ దశలో నిష్క్రమించింది. అయితే, ఈసారి మాత్రం ఘనంగానే సీజన్‌ను ఆరంభించింది. 

ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదింటిలో గెలుపొంది సత్తా చాటింది. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న బెంగళూరు జట్టు ఇప్పటికే ప్రాక్టీసు మొదలెట్టేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి మొదలుకానున్న రెండో అంచెకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌, ఐపీఎల్‌- 2021 రెండో దశ హిందీ కామెంటేటర్‌ గౌతం గంభీర్‌ కోహ్లి సేన గెలుపు అవకాశాల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 

చదవండి: T20 World Cup 2021: ‘పాకిస్తాన్‌తో తలపడే నా జట్టు ఇదే’.. అతడికి చోటివ్వని గౌతీ!

‘‘విరాట్‌కు ఏబీ డివిల్లియర్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. ఒకవేళ మాక్సీ అందుబాటులో లేకపోయినా.. డివిల్లియర్స్‌ అనే అతిపెద్ద బలం తనకు ఉండనే ఉంది. జస్‌ప్రీత్‌ బుమ్రా వంటి స్టార్‌ బౌలర్లను ఎదుర్కోవడంతో ఏబీకి ఎవరూ సాటిరారు. తనలాగా యార్కర్ల కింగ్‌ను ఎదుర్కొన్న మరో బ్యాట్స్‌మెన్‌ను నేనింత వరకూ చూడలేదు. ప్రత్యర్థి జట్టుపై పైచేయి సాధించాలని కోహ్లి రచించే వ్యూహాలు పక్కాగా అమలు కావాలంటే ముందుగా ఒత్తిడిని జయించాల్సి ఉంటుంది.

ఎందుకంటే ఇంతవరకు ఒక్కసారి ఐపీఎల్‌ టైటిల్‌ గెలవని ఆర్సీబీ మీద ఏడాదికేడాది ఒత్తిడి పెరుగుతూనే ఉంటుందనేది కాదనలేని సత్యం. ముఖ్యంగా కోహ్లి, ఏబీ మెరుగ్గా రాణిస్తేనే అనుకున్న ఫలితాలు సాధిస్తారు. లేదంటే.. తదుపరి సీజన్లలోనూ ఆ ఒత్తిడి అలాగే కొనసాగుతుంది’’అని పేర్కొన్నాడు. కాగా సెప్టెంబరు 20న అబుదాబిలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఆర్సీబీ ఐపీఎల్‌ రెండో దశను ఆరంభించనుంది.  

చదవండి: IPL 2021: ప్లేఆఫ్‌ చేరాక ముంబై బుమ్రాకు రెస్ట్‌ ఇస్తుందా?

మరిన్ని వార్తలు