Sanju Samson: ఈసారి కచ్చితంగా చాంపియన్‌గా నిలవాలి!

15 Sep, 2021 13:25 IST|Sakshi
రాజస్తాన్‌ జట్టుతో సంజూ శాంసన్‌(ఫొటో: ఆర్‌ఆర్‌ సోషల్‌ మీడియా)

Sanju Samson To RR Teammates: ‘‘ఈసారి కచ్చితంగా టైటిట్‌ గెలవాలి. చాంపియన్‌గా నిలవాలి. అలా జరగాలంటే.. మనం పూర్తిస్థాయిలో సన్నద్ధమవ్వాలి. ప్రతీ మ్యాచ్‌లోనూ విజయం కోసం శాయశక్తులా పోరాడాలి’’ అని రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ తన జట్టుకు దిశా నిర్దేశనం చేశాడు. ఒకవేళ పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయినా ప్రయత్నలోపం లేకుండా తమ వంతు కృషి చేశామనే సంతృప్తి అయినా ఉండాలన్నాడు.

కాగా క్యాష్‌రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ తొలి విజేత(2008)గా నిలిచిన రాజస్తాన్‌.. ఆ తర్వాత ఇంతవరకు ఒక్కసారి టైటిల్‌ నెగ్గలేకపోయింది. అంతేగాక 2013 సీజన్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో ప్రతిష్ట మసకబారడమే గాకుండా.. రెండేళ్లపాటు నిషేధం ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కనీసం ఈసారైనా చాంపియన్‌గా నిలిచి సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది. అయితే, కోవిడ్‌ కారణంగా ఐపీఎల్‌-2021 సీజన్‌ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

అప్పటికి ఆడిన ఏడు మ్యాచ్‌లలో మూడు గెలుపొందిన రాజస్తాన్‌.. పాయింట్ల పట్టికలో ఐదోస్థానంలో ఉంది. ఇక సెప్టెంబరు 19 నుంచి రెండో అంచె ఆరంభం కానున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ సందర్భంగా.. సంజూ శాంసన్‌ జట్టును ఉద్దేశించి మాట్లాడిన వీడియోను ఫ్రాంఛైజీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

గెలుపో.. ఓటమో.. 
‘‘ప్రత్యర్థి ఎవరైనా సరే.. మీ ఆటిట్యూడ్‌, బాడీ లాంగ్వేజ్‌లో మార్పు ఉండకూడదు. పట్టుదలగా పోరాడాలి. యుద్ధానికి వెళ్తే విజయమో.. వీరణమో కదా. అలాగే... మనం పోరుకు సిద్ధమవుతున్నాం అంటే గెలవడమో.. ఓడిపోవడమో రెండే జరుగుతాయి. అంతేకదా! కాబట్టి ఉత్సాహంతో ముందుకు సాగుదాం. సమిష్టిగా రాణించి ఈ పని పూర్తిచేద్దాం’’ అంటూ సంజూ మోటివేషనల్‌ స్పీచ్‌ ఇచ్చాడు. ఇక ఐపీఎల్‌ రెండో అంచెలో భాగంగా సెప్టెంబరు 21న రాజస్తాన్‌, పంజాబ్‌ కింగ్స్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. జోస్‌ బట్లర్‌, బెన్‌ స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు లేకుండానే బరిలో దిగనుంది. ఇక ఈ సీజన్‌లో సారథి సంజూ శాంసన్‌ ఇప్పటి వరకు 277 పరుగులు సాధించాడు.

చదవండి: IPL 2021 Phase 2: ఇరగదీసిన డివిల్లియర్స్‌.. సిక్సర్ల వర్షం.. కానీ సెంచరీ వృథా!

మరిన్ని వార్తలు