పృథ్వీషా ఆ అలవాటును మార్చుకోవాలి: పాంటింగ్‌

5 Apr, 2021 18:01 IST|Sakshi

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక ఆటగాడు పృథ్వీషాకు ఉన్న వింత అలవాటుపై ఆ జట్టు ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ స్పందించాడు. గతేడాది ఐపీఎల్‌లో విఫలమైన సందర్భంగా షాకు ఉన్న ఆ అలవాటు గరించి తాను తెలుసుకున్నానని పేర్కొన్నాడు. దుబాయ్‌ వేదికగా జరిగిన గత ఐపీఎల్‌ సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో 2 అర్ధశతకాల సాయంతో కేవలం 228 పరుగులు చేసిన షా.. తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యాడని, స్కోర్‌ చేయలేకపోతే నెట్స్‌లో బ్యాటింగ్‌ సాధన చేసే అలవాటు తనకు లేదని చెప్పాడని వెల్లడించాడు.

గత సీజన్‌లో నాలుగైదు ఇన్నింగ్స్‌ల్లో 10 కంటే తక్కువ పరుగులు సాధించినప్పుడు తాను అతనితో మాట్లాడానని, నెట్స్‌లో సాధన చేయాలని కోరితే తన కళ్లలోకి చూసి తాను ఫెయిలైనప్పుడు బ్యాటింగ్‌ సాధన చేయనని చెప్పాడని పేర్కొన్నాడు. అయితే ఈ అలవాటు అతని కెరీర్‌కు ఏమాత్రం మంచిదికాదని చెప్పానని, కోచ్‌గా అతను ఫామ్‌లోలేని సమయంలో తగిన సలహాలు అందించానని పాంటింగ్‌ తెలిపాడు. టెక్నిక్‌ పరంగా టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్‌తో దగ్గరి పోలికలున్న షా..   ఈ ఏడాది ఆ వింత అలవాటుకు స్వస్తిపలికి పరుగుల వరద పారించాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ముంబైకి చెందిన 21 ఏళ్ల పృథ్వీ షా ఈ ఏడాది విజయ్‌ హజారే వన్డే టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 8 మ్యాచ్‌ల్లో 4 భారీ శతకాలు, ఓ అర్ధశతకం సాయంతో 827 పరుగులు సాధించి, టోర్నీ చరిత్రలో ఏ ఆటగాడికి సాధ్యంకాని 800 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో రిషబ్‌ పంత్‌ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ముంబై వేదికగా ఏప్రిల్‌ 10న జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఢీకొంటుంది.
చదవండి: రాయల్‌ లుక్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌..

మరిన్ని వార్తలు