IPL 2021: అక్కడ సక్సెస్‌.. ఇక్కడ ఎందుకిలా?

5 May, 2021 08:00 IST|Sakshi
Photo Courtesy: BCCI/Instagram

ఆట ఆగింది

నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్‌

మెగా టోర్నీకి కరోనా దెబ్బ

ఆటగాళ్ల భద్రత ముఖ్యమని ప్రకటించిన బీసీసీఐ

ఇప్పట్లో లీగ్‌ జరిగే అవకాశం లేనట్లే!

అక్కడ సక్సెస్‌.. మరి ఇక్కడ ఎందుకు ఇలా?

తప్పు ఎక్కడ జరిగింది?

క్రికెట్‌కు కరోనా సోకింది... దాదాపు నెల రోజులుగా అభిమానులను అలరిస్తూ వచ్చిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) కోవిడ్‌–19 దెబ్బకు కుదేలైంది. ‘బయో బబుల్‌’ను బద్దలు చేస్తూ కొత్తగా దూసుకొచ్చిన కరోనా కేసులతో ఐపీఎల్‌ బృందాలు బెంబేలెత్తిపోయాయి. ఫలితంగా లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేయాల్సి వచ్చింది. మా బబుల్‌ సురక్షితం అంటూ... ఏం జరిగినా వెనక్కి తగ్గకుండా లీగ్‌ను కొనసాగిస్తామని గంభీరంగా చెప్పిన ఐపీఎల్‌ పెద్దలకు లీగ్‌ను ఇప్పటికిప్పుడు నిలిపివేయడం తప్ప మరో దారి లేకుండా పోయింది. దేశమంతా కరోనాతో అల్లకల్లోలమవుతున్న వేళ కూడా ‘తమదైన ప్రపంచం’లో ఆడుతూ పోయిన క్రికెటర్లలో ఒక్కసారిగా ఆందోళన పెరగడంతో లీగ్‌ నిర్వహణ సాధ్యం కాదని అర్థం చేసుకున్న గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఇక ఆటగాళ్ల భద్రత, వారిని క్షేమంగా ఇంటికి చేర్చే విషయంపై దృష్టి పెట్టింది. ఆర్థికపరమైన అనేక అంశాలు ముడిపడి ఉండటంతో అధికారికంగా లీగ్‌ ‘రద్దు’ అని ప్రకటించని బోర్డు రాబోయే రోజుల్లో అవకాశం ఉన్న తేదీల్లో మళ్లీ టోర్నీ నిర్వహిస్తుందా లేక ఈ సీజన్‌కు ఇంతేనా అనేది చూడాలి!  

అహ్మదాబాద్‌: అవును...కరోనాకు తరతమ భేదం లేదు. వారు ఎవరైనా సరే పేరు ప్రతిష్టలతో పని లేదు. ఎప్పుడైనా, ఎక్కడ ఉన్నా మీ వెంటే నేనున్నాను అన్నట్లుగా చెంత చేరవచ్చు... అందుకే ఆ వైరస్‌ను ‘బయో బబుల్‌’లు ఆపలేకపోయాయి. అత్యంత సురక్షితం అంటూ చెప్పుకొచ్చిన ఐపీఎల్‌ బయో బబుల్‌ను దాటి కోవిడ్‌–19 క్రికెటర్లకు సోకింది. సోమవారమే ఇద్దరు ఆటగాళ్లు, మరో ఇద్దరు సహాయక సిబ్బందికి పాజిటివ్‌గా తేలగా మంగళవారం మరో ఇద్దరు క్రికెటర్లు, ఒక కోచ్‌ కూడా కరోనా బారిన పడ్డారు. ఢిల్లీ లెగ్‌స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా, సన్‌రైజర్స్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా, చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ కోవిడ్‌–19 పాజిటివ్‌గా తేలారు. దాంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన బీసీసీఐ ముందు జాగ్రత్తగా లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించే విషయంపై మాత్రం బోర్డు ఎలాంటి ప్రస్తావనా చేయలేదు. లీగ్‌తో సంబంధం ఉన్న అందరితో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ వెల్లడించగా... దీనిని తాము స్వాగతిస్తున్నట్లు ఎనిమిది ఫ్రాంచైజీలూ ప్రకటించాయి.  

సెప్టెంబర్‌లో నిర్వహించగలరా? 
ఐపీఎల్‌ వాయిదా అనగానే సగటు క్రికెట్‌ అభిమానికి వచ్చే మొదటి సందేహం మళ్లీ ఎప్పుడు జరుగుతుంది? రాబోయే మరికొద్ది రోజుల్లోనైతే భారత్‌లో పరిస్థితులు మెరుగు పడేలా లేవు. జూన్‌ ఆరంభంలో భారత జట్టు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం ఇంగ్లండ్‌ వెళుతుంది. న్యూజిలాండ్‌తో జరిగే ఈ టెస్టు, ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు మధ్య నెల రోజులకు పైగా విరామం ఉంది. అయితే అంత కచ్చితమైన తేదీలతో అన్ని ఏర్పాట్లతో విదేశాల్లో నిర్వహించడం అయ్యే పని కాదు. సెప్టెంబర్‌ 15 తర్వాత భారత జట్టు స్వదేశానికి తిరిగొస్తుంది. ఈ సమయంలో మాత్రం షెడ్యూల్‌ ఖాళీగా ఉంది. దీని తర్వాత న్యూజిలాండ్‌కు ఆతిథ్యం, ఆపై టి20 ప్రపంచకప్‌ ఉన్నాయి కాబట్టి సెప్టెంబరులో కొంత వరకు అవకాశం ఉంది. 

అందుకే వాయిదా వేస్తున్నాం
ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్, బీసీసీఐ నిర్వహించిన అత్యవసర సమావేశంలో వెంటనే ఐపీఎల్‌–2021ను వాయిదా వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం. లీగ్‌తో సంబంధం ఉన్న ఆట గాళ్లు, సహాయక సిబ్బంది భద్రత విష యంలో ఏ రకంగానూ బోర్డు రాజీ పడదు. అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయానికి వచ్చాం. భారత్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న కష్టకాలంలో కాస్త ఆనందం పంచేందుకు మేం ప్రయత్నించాం. అయితే టోర్నీ ఆగిపోయింది కాబట్టి అందరూ తమ కుటుంబసభ్యులు, సన్నిహితులను కలుసుకోవడం అన్నింటికంటే ముఖ్యం. అందరూ క్షేమంగా ఇంటికి చేరే విషయంలో బీసీసీఐ అన్ని రకాలుగా సహకారం అందిస్తుంది. ఇంత కఠిన పరిస్థితుల్లోనూ లీగ్‌ను ఇప్పటి వరకు నిర్వహించేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు.      –బీసీసీఐ

తప్పు జరిగిందా..!
గత ఏడాది కూడా ప్రపంచాన్ని కరోనా కమ్మేసింది. ఇలాంటి స్థితిలోనూ ఐపీఎల్‌ను ఎలాగైనా నిర్వహించాలని బీసీసీఐ పట్టుదల కనబర్చింది. దానికి తగినట్లుగానే కొంత ఆలస్యంగానైనా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)ని వేదికగా చేసుకొని విజయవంతంగా టోర్నీని ముగించింది. గత ఏడాది నవంబర్‌ 10న ఐపీఎల్‌ ఫైనల్‌ జరగ్గా... సరిగ్గా ఐదు నెలలలోపే ఈ ఏప్రిల్‌ 9న కొత్త సీజన్‌ ప్రారంభం చేస్తున్నట్లుగా బోర్డు ప్రకటించింది. యూఏఈలో ఏర్పాటు చేసిన ‘బయో బబుల్‌’లో ఒక్క లోటు కూడా లేకుండా అంతా పక్కాగా నిర్వహణ సాగింది. దాని ద్వారా వచ్చిన అనుభవం వల్లనో లేక అతి విశ్వాసం వల్లనో అదే నమూనాలో భారత్‌లోనే టోర్నీ జరపగలమనే ధైర్యం బీసీసీఐకి వచ్చింది.

మరోసారి లీగ్‌ జరిపేందుకు యూఏఈ ఆఫర్‌ ఇచ్చినా... కరోనా కేసులు తక్కువగా ఉండటంతో పాటు తక్కువ ఖర్చులో పూర్తి చేసుకోగలిగే శ్రీలంక కూడా ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైనా బీసీసీఐ అంగీకరించలేదు. అన్నింటికి మించి ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లలో భారత్‌లో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ నిర్వహణకు సన్నాహకంగా ఐపీఎల్‌ను భావించింది. దీనిని విజయవంతంగా నిర్వహించగలిగితే వరల్డ్‌కప్‌ ఆడే జట్ల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవచ్చని బోర్డు అనుకుంది. అయితే వేర్వేరు నగరాల్లో నిర్వహించే ‘సాహసం’ చేయడంలోనే మొదటి తప్పు జరిగింది. ఇండియన్‌ సూపర్‌లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీ తరహాలో ఏదైనా ఒకే నగరానికి టోర్నీని పరిమితం చేసి ‘బయో బబుల్‌’ను పటిష్టంగా ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది.

కానీ ఏకంగా ఆరు వేదికలను లీగ్‌ కోసం ఎంపిక చేసింది. ఒక జట్టు ఆటగాళ్లు విమానంలో మరో నగరానికి ప్రయాణం చేస్తుండటంతోనే బబుల్‌ ఒక రకంగా బద్దలైనట్లు! ఎక్కడి నుంచైనా కరోనా సోకే అవకాశం ఉన్న పరిస్థితుల్లోనే ఆటగాళ్లు నగరాలు మారుతూ వచ్చారు. గత సంవత్సరం యూఏఈలో మూడు నగరాల్లో లీగ్‌ జరగ్గా... మూడు చోట్లా ఆటగాళ్లు తమ కోసమే ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో మాత్రమే ప్రయాణించారు. విమానం ఎక్కాల్సిన అవసరం రాలేదు.

మరో ప్రధాన తేడా యూఏఈ ప్రభుత్వ నిబంధనలు. అక్కడ కఠినమైన ఆంక్షలు, భారీ జరిమానాలు ఉండటంతో సాధారణ పౌరుడి మొదలు ఎవరైనా కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిన రావడంతో ఉల్లంఘనలకు ఆస్కారం లేకుండా పోయింది. భారత్‌లో సహజంగానే పలు అంశాల్లో కనిపించే ఉదాసీన వైఖరి ‘బయో బబుల్‌’ నిర్వహణలోనూ కనిపించింది. వారం రోజుల క్రితం వరకు కూడా క్రికెటర్లు తాము ఉంటున్న నగరంలో ఎక్కడి నుంచైనా నచ్చిన భోజనాన్ని ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ద్వారా తెప్పించుకునే అవకాశం కల్పించారు. మరోవైపు నిబంధనలు పాటించకుండా బయటి వ్యక్తులు కూడా క్రికెటర్లను కలవగలిగారని తెలుస్తోంది. ఇలాంటి పలు కారణాలతో కరోనా క్రికెటర్ల వరకు చేరిందనేది వాస్తవం. 

చదవండి: IPL 2021: రూ. 2,200 కోట్ల నష్టం!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు