పంత్‌ ఒక ప్రత్యేకం.. అది నా వల్ల కానేకాదు: పుజారా

4 Apr, 2021 19:16 IST|Sakshi

ముంబై: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతున్నాడు చతేశ్వర్‌ పుజారా. ఏడేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌ ఆడుతుండటంతో పుజారా మంచి జోష్‌లో ఉన్నాడు. ప్రాక్టీస్‌లో కూడా భారీ షాట్‌లో ఆడుతూ తన ఆటకు పదునుపెడుతున్నాడు. మరికొన్ని ఐపీఎల్‌లు ఆడాలంటే పుజారా తనను తాను నిరూపించుకోవాల్సింది ఉంది. ఇక్కడ హిట్టింగే ప్రధానం. ఈ క్రమంలో ప్రాక్టీస్‌లో శ్రమిస్తున్నాడు. ఏప్రిల్‌10వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగునున్న మ్యాచ్‌లో సీఎస్‌కే బృందంలో పుజారాకు చోటు దక్కుతుందా.. లేదా అనే విషయాన్ని పక్కనపెడితే, కొన్ని విషయాల్ని షేర్‌ చేసుకుంటున్నాడు.

ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో చాట్‌ చేసిన పుజారా.. స్కూప్‌, రివర్స్‌ స్కూప్‌ షాట్‌ల గురించి మాట్లాడాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు రిషభ్‌ పంత్‌ను ప్రత్యేకంగా ప్రశంసించాడు. ప్రధానంగా పంత్‌ ఆడే రివర్స్‌ స్కూప్‌ షాట్ల గురించి పుజారా తన మనసులో మాటను వెల్లడించాడు. ‘ రివర్ప్‌ స్కూప్‌ షాట్ల ఆడటంలో పంత్‌ ఒక ప్రత్యేకం. పంత్‌ తరహాలో రివర్స్‌ స్కూప్‌ ఆడటం నా వల్ల కానేకాదు. అది ఎప్పటికీ జరగదు కూడా. పంత్‌ ఒక ఫియర్‌లెస్‌ క్రికెటర్‌. అందుకే ఆ షాట్లను చాలా ఈజీగా ఆడుతున్నాడు. పంత్‌ ఆడే ఆ షాట్లను నేను కచ్చితంగా ఆడలేను. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌ అనేవాడు రివర్స్‌ స్కూప్‌ ఆడటం కష్టమనే నేను అనుకుంటా.

నేను స్కూప్‌ షాట్లను భయం లేకుండా ఆడతా.. కానీ రివర్స్‌ స్కూప్‌ షాట్లను ఆడను. థర్డ్‌ మ్యాన్‌ పైనుంచి ఆడే ఆ షాట్లతో చాలా రిస్క్‌. ఆ షాట్లు ఆడటంలో పంత్‌కు అరుదైన టెక్నిక్‌ ఉందనే చెప్పాలి. పదే పదే ఆ షాట్లను ఆడమన్నా పంత్‌కు ఆ సత్తా ఉంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో పంత్‌ ఆ షాట్లు ఆడుతుంటే మా డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్నవాళ్లమంతా షాక్‌ అయ్యాం’ అని చెప్పుకొచ్చాడు. మరి సీఎస్‌కే తన తొలి మ్యాచ్‌ను ఢిల్లీతోనే ఆడుతున్న తరుణంలో ఫామ్‌లో ఉన్న పంత్‌ను కట్టడి చేయడానికి వ్యూహాలు సిద్ధం చేసుకోకతప్పదు. 

ఇక్కడ చదవండి: మెరుపులాంటి ఫీట్‌లు.. మతిపోయే క్యాచ్‌లు

ఆ క్యాచ్‌పై తీవ్ర చర్చ.. మీరు కూడా ఓ లుక్కేయండి

మరిన్ని వార్తలు