పుజారా ఆన్‌ ఫైర్‌.. సిక్సర్లు బాదుతున్న నయా వాల్‌

31 Mar, 2021 17:38 IST|Sakshi

ముంబై: ఏప్రిల్‌ 9 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 14వ ఎడిషన్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా సన్నద్ధమవుతున్నాడు. తనపై టెస్ట్‌ క్రికెటర్‌గా ఉన్న ముద్రను తొలగించుకునేందుకు  తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాడు. ఇందులో భాగంగా  సహచర ఆటగాళ్లతో కలిసి నెట్స్‌లో కఠోర సాధన చేస్తున్నాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. ముఖ్యంగా స్పిన్‌ బౌలింగ్‌లో భారీ షాట్లతో విరుచుకుపడుతూ, పుజారా ఆన్‌ ఫైర్‌ అనిపిస్తున్నాడు. నెట్స్‌లో అతను భారీ షాట్లు ఆడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

చాలా కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉన్న పుజారా టీ20 క్రికెట్‌ ఎలా ఆడుతాడో అన్న ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఆయన భారీ షాట్లతో విరుచుకుపడటం అభిమానులను అంతులేని ఆనందాన్ని కలిగిస్తోంది. 2014 తర్వాత పుజారా ఐపీఎల్‌ ఆడబోతుండటం ఇదే తొలిసారి. ఐపీఎల్‌ 2021 కోసం నిర్వహించిన వేలంలో పుజారాను చెన్నై కనీస ధరను(రూ.50లక్షలు) వెచ్చించి దక్కించుకుంది. పుజారా తన ఓవరాల్‌ ఐపీఎల్‌ కెరీర్‌లో మొత్తం 30 మ్యాచ్‌లు ఆడగా, 99.74 స్ట్రయిక్‌ రేట్‌తో 390 పరుగులు సాధించాడు. ఇందులో ఒక హాఫ్‌ సెంచరీ(51) కూడా ఉంది. కాగా, టీమిండియా తరఫున 85 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన పుజారా.. ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా ఆడకపోవడం విశేషం. ఇదిలా ఉండగా ముంబై వేదికగా ఏప్రిల్‌ 10న జరిగే మ్యాచ్‌లో చెన్నై జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
చదవండి: ఈ రూల్స్‌ అప్పుడుంటే సచిన్‌, గంగూలీలకు అవకాశాలు వచ్చేవి కావు..

>
మరిన్ని వార్తలు