ఐపీఎల్‌ 2021: పంజాబ్‌ పదునెంత?

31 Mar, 2021 00:32 IST|Sakshi

నిలకడలేని ప్రదర్శన

ఈసారి కొత్త పేరు, కొత్త జెర్సీతో బరిలోకి

ఒకే ఒక్కసారి ఫైనల్‌కు... మరోసారి సెమీఫైనల్‌కు ... 13 ఏళ్ల ఐపీఎల్‌ ప్రస్థానంలో పంజాబ్‌ జట్టు గురించి చెప్పుకోవడానికి ఇంతకుమించి ఏమీ లేదు. ఆటగాళ్లు మారినా, కెప్టెన్లు, కోచ్‌లు మళ్లీ మళ్లీ మారినా... టీమ్‌ జెర్సీ రూపురేఖలు మార్చినా ఆ జట్టు రాత మాత్రం మారలేదు... 5, 8, 5, 6, 6, 8, 8, 5, 7, 6, 6... లీగ్‌లోని మిగిలిన సీజన్లలో ఆ జట్టు స్థానం ఇది. అప్పుడప్పుడు కొన్ని వ్యక్తిగత ప్రదర్శనల మెరుపులు తప్ప ఒక జట్టుగా పంజాబ్‌ పెద్దగా ఫలితాలు సాధించలేకపోయింది. ఇప్పుడు ‘ఎలెవన్‌’ను పక్కన పడేసి టీమ్‌ పేరులో స్వల్ప మార్పుతో ‘కింగ్స్‌’గానే వస్తున్న పంజాబ్‌ ఏప్రిల్‌ 9 నుంచి మొదలయ్యే ఐపీఎల్‌ సీజన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. కుంబ్లే శిక్షణలో, కేఎల్‌ రాహుల్‌ నాయకత్వంలో జట్టు బరిలోకి దిగుతోంది.  –సాక్షి క్రీడావిభాగం

కొత్తగా వచ్చినవారు... 
వేలంలో ఇద్దరు యువ ఆసీస్‌ పేసర్ల కోసం పంజాబ్‌ భారీ మొత్తం వెచ్చించింది. జాయ్‌ రిచర్డ్సన్‌ (రూ.14 కోట్లు), రిలీ మెరిడిత్‌ (రూ. 8 కోట్లు) విలువ పలకగా... చెన్నైకి చెందిన ఆల్‌రౌండర్‌ షారుఖ్‌ ఖాన్‌ (రూ. 4 కోట్లు), మరో ఆసీస్‌ ఆటగాడు హెన్రిక్స్‌ (రూ. 5.25 కోట్లు) కూడా ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోయారు. ఈ ముగ్గురు కాకుండా డేవిడ్‌ మలాన్‌ (ఇంగ్లండ్‌), ఫాబియన్‌ అలెన్‌ (వెస్టిండీస్‌), జలజ్‌ సక్సేనా, సౌరభ్‌ కుమార్, ఉత్కర్ష్‌ సింగ్‌ (భారత్‌) జట్టులోకి వచ్చారు. వేలానికి ముందు పంజాబ్‌కు విదేశీ పేస్‌ బౌలర్లు, విదేశీ ఆల్‌రౌండర్ల అవసరం కనిపించింది. దానికి తగినట్లుగానే వారు తాము అనుకున్న విధంగా ఆటగాళ్లను ఎంపిక చేసుకోలిగారు. వేలం కోసం గరిష్టంగా అనుమతించిన రూ. 85 కోట్లలో పంజాబ్‌ వద్ద చివరకు రూ. 18.2 కోట్లు మిగిలిపోగా... నాణ్యమైన క్రికెటర్లు అందుబాటులో లేక ఆ మొత్తాన్ని  ఉపయోగించలేదు.

జట్టు వివరాలు:  
భారత ఆటగాళ్లు: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), హర్‌ప్రీత్, ఇషాన్‌ పొరెల్, ఉత్కర్ష్‌ సింగ్, మన్‌దీప్‌ సింగ్, దీపక్‌ హుడా, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌ సింగ్, సర్ఫరాజ్‌ ఖాన్, మయాంక్‌ అగర్వాల్, మొహమ్మద్‌ షమీ, దర్శన్, షారుఖ్‌ ఖాన్, మురుగన్‌ అశ్విన్, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, సౌరభ్‌ కుమార్, జలజ్‌ సక్సేనా. 
విదేశీ ఆటగాళ్లు: మొయిజెస్‌ హెన్రిక్స్, జాయ్‌ రిచర్డ్సన్, క్రిస్‌ జోర్డాన్, మెరిడిత్, నికోలస్‌ పూరన్, ఫాబియాన్‌ అలెన్, క్రిస్‌ గేల్, డేవిడ్‌ మలాన్‌. 
సహాయక సిబ్బంది: అనిల్‌ కుంబ్లే (డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్, హెడ్‌ కోచ్‌), ఆండీ ఫ్లవర్‌ (అసిస్టెంట్‌ కోచ్‌), వసీం జాఫర్‌ (బ్యాటింగ్‌ కోచ్‌), రైట్‌ (బౌలింగ్‌ కోచ్‌), జాంటీ రోడ్స్‌ (ఫీల్డింగ్‌ కోచ్‌). 

అత్యుత్తమ ప్రదర్శన: 2014లో ఫైనల్‌ 
2020లో ప్రదర్శన: మొత్తం 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి ఆరో స్థానంతో ముగించింది. తొలి సగం మ్యాచ్‌లలో హోరాహోరీగా పోరాడినా ఒకే ఒక విజయం దక్కింది. ఇక నిష్క్రమణ ఖాయమనుకున్న దశలో వరుసగా ఐదు విజయాలు సాధించి దూసుకొచ్చింది. అయితే తప్పనిసరిగా గెలవాల్సిన పోరులో విఫలం కావడంతో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.  

తుది జట్టు అంచనా
గత ఐపీఎల్‌లో పంజాబ్‌ ఆడిన తీరును బట్టి చూస్తే తొలి 11 మందిలో రాహుల్, మయాంక్, షమీ, రవి బిష్ణోయ్‌ మాత్రం అన్ని మ్యాచ్‌లు కచ్చితంగా ఆడతారు. గత సీజన్‌లో కాస్త ఆలస్యంగా బరిలోకి దించినా... గేల్‌ విలువేమిటో తెలుసు కాబట్టి ఈసారి మాత్రం అతను అన్ని మ్యాచ్‌లలో బరిలోకి దిగే అవకాశం ఉంది. పూరన్‌కు కూడా చోటు ఖాయం. తాజా ఫామ్‌ను బట్టి చూస్తే మలాన్‌ జట్టులో ఉంటాడు. భారీ మొత్తాలు ఇచ్చారు కాబట్టి ఇద్దరు విదేశీ పేసర్లు రిచర్డ్సన్, మెరిడిత్‌లను ఆడిస్తారా లేక అందుబాటులో ఉన్న ముగ్గురు ఆల్‌రౌండర్ల నుంచి ఒకరిని ఎంపిక చేస్తారా చూడాలి. మిగిలిన బ్యాట్స్‌మెన్‌లలో సర్ఫరాజ్, మన్‌దీప్, షారుఖ్‌లలో ఇద్దరికి అవకాశం దక్కవచ్చు. ఆఫ్‌స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా జలజ్‌ లేదా హుడాలలో ఒకరు ఉంటారు.

కొత్త జెర్సీతో... 
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నుంచి పంజాబ్‌ కింగ్స్‌గా పేరు మార్చుకున్న టీమ్‌ మంగళవారం తమ టీమ్‌ కొత్త జెర్సీని విడుదల చేసింది. ఎరుపు ప్రధాన రంగుతో అంచుల్లో బంగారపు రంగు కలగలిసిన ఈ జెర్సీపై సింహం బొమ్మ లీలగా కనిపిస్తోంది. అయితే ఇది ఆరంభ సీజన్లలో ఆర్‌సీబీ వాడిన జెర్సీనే గుర్తు చేస్తోందంటూ ఇప్పటికే వీరాభిమానులు కూడా సోషల్‌ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు