Ashwin Vs Morgan: గొడవ పడ్డానా... మౌనం వీడిన అశ్విన్‌.. వరుస ట్వీట్లు!

30 Sep, 2021 14:37 IST|Sakshi
Photo Credit: BCCI/ IPL

Ravichandran Ashwin Tweets Goes Viral: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, ఆటగాడు టిమ్‌ సౌథీతో జరిగిన గొడవ గురించి ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ ఎట్టకేలకు మౌనం వీడాడు. వరుస ట్వీట్లతో సదరు ఘటన గురించి తన స్పందన తెలియజేశాడు. తప్పొప్పుల గురించి మాట్లాడేటపుడు కాస్త ఆలోచించాలని విమర్శకులకు హితవు పలికాడు. నిబంధనలకు లోబడి ఆడటం, మైదానం వీడిన తర్వాత గొడవల గురించి మర్చిపోవడం అసలైన క్రీడాస్ఫూర్తి అన్న విషయం పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలని తల్లిదండ్రులకు సూచించాడు. 

ఈ మేరకు అశ్విన్‌ ...‘‘ఫీల్డర్‌ విసిరిన బంతి రిషభ్‌ తాకిందన్న విషయం నాకు తెలియదు. ఆ సమయంలో నేను మరో పరుగు కోసం వెళ్లాను. నిజంగా పంత్‌ను బంతి తాకిన విషయం నేను చూశానా? ఆ తర్వాత కూడా రన్‌ కోసం వెళ్తానా అంటే.. కచ్చితంగా..! మోర్గాన్‌ చెప్పినట్లు నాకు ఇతరులను గౌరవించడం రాదా? కానే కాదు! నిజంగా నేను గొడవకు దిగానా? లేదు.. అస్సలు లేదు.. నా పాటికి నేను అక్కడ నిల్చుని ఉన్నాను. నా తల్లిదండ్రులు, టీచర్లు చెప్పినట్లు బుద్ధిగా నిల్చుని ఉన్నా. మీరు కూడా మీ పిల్లలకు ఇదే చెప్పండి. 

మోర్గాన్‌, సౌథీ వారి క్రికెట్‌ ప్రపంచంలో వారికి నచ్చిందే సరైందని భావించవచ్చు. కానీ, మైదానంలో ఒకరిని తక్కువ చేసి మాట్లాడే హక్కు వారికి లేదు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఎవరు మంచివాళ్లు.. ఎవరు కాదు అన్న విషయాల గురించి కొంత మంది చర్చ మొదలెట్టేశారు. క్రికెట్‌ అనేది జెంటిల్‌మెన్‌ గేమ్‌. ఎంతో మంది క్రికెటర్లు ఉన్నారు. ఒక్కొక్కరి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది. ఫీల్డర్‌ విఫలమైనపుడు అదనపు రన్‌ కోసం పరుగు తీయడం మీ కెరీర్‌ను బ్రేక్‌ చేస్తుందా?

ఆ సమయంలో నాన్‌ స్ట్రైకర్‌ను పరుగు వద్దని హెచ్చరించి, మనం కూడా వారి ప్రతిపాదన తిరస్కరిస్తేనే మంచి వ్యక్తి అని, లేదంటే చెడ్డవాళ్లు అంటూ ఇతరులను కన్‌ఫ్యూజన్‌లో పడేయకండి. మైదానంలో నిబంధనలకు అనుగుణంగా... పూర్తిస్థాయిలో మన శక్తి సామర్థ్యాలు ఒడ్డి జట్టుకు ప్రయోజనకరంగా ఉండటం మంచి విషయం. ఆట పూర్తైన తర్వాత చేతులు కలిపి మాట్లాడుకోవడం అనేదే క్రీడా స్ఫూర్తి అన్న విషయం నాకు అర్థమైంది’’అని సుదీర్ఘ పోస్టు పెట్టాడు. తన తప్పేమీ లేదని పరోక్షంగా మోర్గాన్‌, సౌథీకి కౌంటర్‌ ఇచ్చాడు.

కాగా సెప్టెంబరు 28న కేకేఆర్‌తో మ్యాచ్‌ సందర్భంగా సౌథీ, అశ్విన్‌ల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ గొడవలో కెప్టెన్‌ మోర్గాన్‌ దూరి సౌథీకి మద్దతు పలికాడు. దీంతో ఆశ్విన్‌ మోర్గాన్‌కు బ్యాట్‌ చూపిస్తూ సీరియస్‌గా కనిపించాడు. అంతలో.. వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ జోక్యం చేసుకోవడంతో అక్కడితో వివాదం సద్దుమణిగింది. అయితే, ఆ తర్వాత దినేశ్‌ కార్తిక్‌ మాట్లాడుతూ..  బాల్‌ పంత్‌ను తాకిన తర్వాత కూడా అశ్విన్‌ పరుగు తీయడం క్రీడా స్ఫూర్తికి విరుద్దమనే ఉద్దేశంలో మోర్గాన్‌ అలా స్పందించి ఉంటాడని అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో అశ్విన్‌ ఈ మేరకు ట్వీట్లు చేయడం గమనార్హం.

చదవండి: Harshal Patel: కోహ్లి తొడను గట్టిగా రుద్దేశాను.. సిరాజ్‌ కాలికి గాయం!

>
మరిన్ని వార్తలు