టెంపో డ్రైవర్‌గా తండ్రి కష్టం, తమ్ముడి ఆత్మహత్య కలిచివేశాయి..

13 Apr, 2021 15:57 IST|Sakshi

ముంబై: రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున అరంగేట్రం మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో(3/31) ఆకట్టుకున్న చేతన్‌ సకారియా ఇప్పుడు యావత్‌ క్రికెట్‌ ప్రపంచం దృష్టిని ఆకర్శిస్తున్నాడు. సోమవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ప్రపంచ స్థాయి బౌలర్లంతా చేతులెత్తేసిన వేళ, తాను మాత్రం పొదుపుగా బౌలింగ్‌ చేసి, మూడు కీలకమైన వికెట్లు(మయాంక్‌, కేఎల్‌ రాహుల్‌, రిచర్డ్‌సన్‌) సాధించి ఔరా అనిపించాడు. పంజాబ్‌ బ్యాట్స్‌మెన్ల సిక్సర్ల సునామీలో ప్రతి ఒక్క రాజస్థాన్‌ బౌలర్‌ కొట్టుకుపోగా, సకారియా మాత్రం ఒక్కటంటే ఒక్క సిక్సర్‌ కూడా ఇవ్వకుండా కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేసి శభాష్‌ అనిపించాడు. దీంతో పాటు అతను ఓ కళ్లు చెదిరే క్యాచ్‌ను(నికోలస్‌ పూరన్‌) సైతం అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ జట్టు ఓటమిపాలైనప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్‌ సంజూ సామ్సన్‌(119) అద్భుత శతక పోరాటం, చేతన్‌ సకారియా అదిరిపోయే బౌలింగ్‌ స్పెల్‌ ఐపీఎల్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి. 

ఇదిలా ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్‌ మినీ వేళంలో 1.2 కోట్లు ధర పలికిన 23 ఏళ్ల ఈ సౌరాష్ట్ర కుర్రాడి అదిపోయే ప్రదర్శన వెనుక సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోని ఓ విషాద గాధ నెలకొంది. ఐపీఎల్ వేలానికి కొద్ది రోజుల ముందే సకారియా తన తమ్ముడిని కోల్పోయాడు. జనవరిలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఆడుతున్న సమయంలో అతని తమ్ముడు రాహుల్‌ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అయితే ఆ సమయంలో ఈ విషాద వార్తను తల్లిదండ్రులు సకారియాకు తెలీనివ్వలేదు. తమ్ముడంటే సకారియాకు చాలా ఇష్టమని, దీంతో అతను ఎక్కడ డిస్టర్బ్ అవుతాడోనన్న భయంతో విషయం అతనికి చెప్పలేదని, ఆతర్వాత మెల్లగా తన తమ్ముడు లేడన్న వార్తను తెలియజేశామని తల్లిదండ్రులు తెలిపారు. 

ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికిన అనంతరం తన తమ్ముడిని కోల్పోయిన విషయాన్ని సకారియా మీడియాకు తెలియజేస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు నా తమ్ముడు బతికి ఉంటే నాకంటే ఎక్కువ సంతోషించేవాడని కన్నీటిపర్యంతమయ్యాడు. ఇదే సందర్భంలో సకారియా తన కుటుంబ నేపథ్యం గురించి మీడియాకు వివరించాడు. తమది చాలా పేద కుటుంబమని, తన తండ్రి టెంపో నడుపుతూ, ఆ సంపాదనతోనే అన్నదమ్ములను పోషించాడని, తాను డబ్బు సంపాదించే సమయానికి తమ్ముడు లేకపోవడం బాధాకరమని దుఖాన్ని వెల్లబుచ్చాడు. ఐపీఎల్‌ వేళంలో వచ్చిన డబ్బుతో ఓ ఇల్లు కొంటానని ఈ లెఫ్టార్మ్ పేసర్ తెలిపాడు. 

>
మరిన్ని వార్తలు