స్టోక్స్‌కు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ అందజేసిన రాజస్థాన్‌ రాయల్స్‌..

18 Apr, 2021 18:01 IST|Sakshi

ముంబై: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్.. ఐపీఎల్‌ 2021 ప్రయాణాన్ని ఒక్క మ్యాచ్‌తోనే ముగించాడు. పంజాబ్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ క్యాచ్‌ను అందుకునే క్రమంలో స్టోక్స్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయం కావడంతో డాక్టర్లు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. దీంతో అతను శుక్రవారం రాత్రి స్వదేశానికి బయల్దేరాడు. ఈ క్రమంలో రాజస్థాన్‌ యాజమాన్యం తమ ముఖ్యమైన ఆటగాడికి ఘనంగా వీడ్కోలు పలికింది. తప్పనిసరి పరిస్థితుల్లో అయిష్టంగా జట్టును వీడుతున్న స్టోక్స్‌కు అపురూపమైన కానుకను అందించింది. ఇటీవల మరణించిన అతని తండ్రి జెడ్ స్టోక్స్ పేరిట జెర్సీని రూపొందించి అతన్ని సర్‌ప్రైజ్‌ చేసింది. స్టోక్స్‌ త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేసింది. 

ఇదిలా ఉంటే, స్టోక్స్‌కు రాజస్థాన్‌ రాయల్స్‌ను వీడి వెళ్లడానికి అస్సలు ఇష్టంలేదని, సర్జరీ అనివార్యం కావడంతో అతను బలవంతంగా స్వదేశానికి వెళ్లాల్సి వచ్చిందని తెలుస్తోంది. తొలుత అతను జట్టుతో పాటే ఉండి సలహాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని, ఇదే విషయాన్ని ఫ్రాంచైజీకి తెలుపగా, వారు కూడా సమ్మతం వ్యక్తం చేశారని ఆర్‌ఆర్‌ యాజమాన్యం ముఖ్యులొకరు వెల్లడించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆపరేషన్‌ తప్పనిసరి కాబట్టి స్టోక్స్‌ స్వదేశానికి బయల్దేరక తప్పలేదని ఆయన పేర్కొన్నాడు.

స్టోక్స్‌కు వీడ్కోలు పలికిన అనంతరం అభిమానులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 'సర్జరీ అనివార్యం కావడంతో ఈ ఐపీఎల్‌ సీజన్‌లో నీ మెరుపుల్ని మిస్సవుతాం' అని ఒక అభిమాని ట్వీట్‌ చేయగా, 'అవును డ్యూడ్‌. నువ్వు రాజస్థాన్‌కు మోస్ట్‌ వాల్యూబుల్‌ ప్లేయర్‌వి. టేక్‌ కేర్‌' అంటూ మరొకరు ట్వీట్‌ చేశారు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో కూడా స్టోక్స్‌ రాజస్థాన్‌ రాయల్స్‌తోనే కొనసాగాలని అభిమానులు భారీ ఎత్తున ట్వీట్లు చేశారు. కాగా, 2018 నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న స్టోక్స్.. ఇప్పటి వరకు 31 మ్యాచ్‌ల్లో 604 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 16 వికెట్లు తీశాడు. 
చదవండి: ఆ జట్టు‌కు గెలిచే అర్హతే లేదు: మంజ్రేకర్‌
 

>
మరిన్ని వార్తలు