'మ్యాచ్‌ చూశాక ఆశలు చిగురించాయి.. కొత్త విజేతను చూస్తా'

28 Apr, 2021 16:11 IST|Sakshi
courtesy : IPL Twitter

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఒత్తిడిలో చివరి ఓవర్‌ వేసిన ఆర్‌సీబీ బౌలర్‌ సిరాజ్‌ అద్బుతంగా బౌలింగ్‌ చేసి విజయాన్ని అందించాడు. కాగా మ్యాచ్‌ అనంతరం టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ట్విటర్‌ వేదికగా స్పందించాడు.

కోహ్లి, పంత్‌ల ఫోటోను షేర్‌ చేస్తూ ఈసారి ఐపీఎల్‌ టైటిల్‌ను ఎప్పుడు గెలవని జట్లే గెలవనున్నాయనిపిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌, ఆర్‌సీబీ ఎవరు చూసుకున్నా ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిన్నటి మ్యాచ్‌ అద్భుతం.. ఆ మ్యాచ్‌ల నాలో కొత్త ఆశలు రేకెత్తాయి. ఈసారి ఐపీఎల్‌లో కచ్చితంగా కొత్త విజేతను చూస్తాం.. అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌తో పాటు రెండు సార్లు చాంపియన్‌ కేకేఆర్‌ ఈ సీజన్‌లో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమతున్నాయని తెలిపాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఏబీ డివిలియర్స్‌ (42 బంతుల్లో 75 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగగా... రజత్‌ పటిదార్‌ (22 బంతుల్లో 31; 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులు చేయగలిగింది. రిషభ్‌ పంత్‌ (48 బంతుల్లో 58 నాటౌట్‌; 6 ఫోర్లు), షిమ్రాన్‌ హెట్‌మైర్‌ (25 బంతుల్లో 53 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. కాగా ఢిల్లీపై విజయంతో ఆర్‌సీబీ 10 పాయింట్లతో టాప్‌ స్థానానికి చేరుకోగా.. ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్‌ పాయింట్ల పట్టికలో మూడోస్థానంలో నిలిచింది.
చదవండి: అందుకే ఆఖరి ఓవర్‌ స్టోయినిస్‌ చేతికి: పంత్‌

ఏబీడీ అరుదైన ఘనత; నా ఐడల్‌ అన్న వార్నర్‌!

మరిన్ని వార్తలు