IPL 2021: ఆర్సీబీకి భారీ షాక్‌.. వారిద్దరూ ఔట్‌!

26 Apr, 2021 11:05 IST|Sakshi
Photo Courtesy: PTI

బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంఛైజీలకు ఎదురుదెబ్బ తగులుతోంది. ఐపీఎల్‌-2021లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫును ఆడుతున్న ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్ర అశ్విన్‌ ఇప్పటికే తాను టోర్నీకి విరామం ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా బారిన పడిన తన కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు అశ్విన్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఢిల్లీ కీలక ఆటగాడిని కోల్పోయినట్లయింది. ఇక తాజాగా రాయల్స్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు కూడా ఇలాంటి షాకే తగిలింది.

ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడం జంపా ఐపీఎల్‌-2021 నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో తాము స్వదేశానికి వెళ్లిపోతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆర్సీబీ ధ్రువీకరించింది. ఈ మేరకు... ‘‘ వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆడం జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌ ఆస్ట్రేలియాకు వెళ్లిపోతున్నారు. ఈ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లకు వారు అందుబాటులో ఉండరు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు యాజమాన్యం వారి నిర్ణయాన్ని గౌరవిస్తోంది. వారికి ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తుంది’’ అని ట్విటర్‌ వేదికగా అధికారిక ప్రకటన చేసింది.

కాగా, భారత్‌లో ఉన్న ఆటగాళ్లు వెంటనే వెనక్కి రావాలని ఆస్ట్రేలియా సూచించినట్లు సమాచారం. ఒకవేళ ఇప్పుడు గనుక స్వదేశానికి రాకపోతే 3 నెలల పాటు రావడానికి వీల్లేదన్న షరతుల నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వ సూచన మేరకు సదరు ఆటగాళ్లు భారత్‌ నుంచి వెనక్కి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సీజన్‌లో రిచర్డ్‌సన్‌, రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడగా, ఆడం జంపా ఇంతవరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. ఇక ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో 69 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌-2021లో కోహ్లి సేనకు ఇదే తొలి ఓటమి.

చదవండి: IPL 2021: అప్పుడే మళ్లీ మైదానంలోకి దిగుతా: అశ్విన్‌

మరిన్ని వార్తలు