14.25 కోట్లు: క్రేజీ అనుకున్నా.. కానీ తప్పని నిరూపించాడు!

19 Apr, 2021 11:17 IST|Sakshi
Photo Courtesy: RCB Twitter

గ్లెన్‌ మాక్స్‌వెల్‌పై గ్రేమ్‌ స్వాన్‌ ప్రశంసల జల్లు

చెన్నై: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌పై ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌ స్వాన్‌ ప్రశంసలు కురిపించాడు. తన విధ్వంసకర ఆటతీరు తనను ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నాడు. ఐపీఎల్‌-2021లో భాగంగా, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మాక్సీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 49 బంతుల్లో 9 ఫొర్లు, 3 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేసి సత్తా చాటాడు. మాక్స్‌వెల్‌తో పాటు డివిలియర్స్‌ వీరోచిత ఇన్నింగ్స్‌కు తోడు, బౌలర్లు కైల్‌ జేమీసన్‌ (3/41),  హర్షల్‌ పటేల్‌ (2/17), యజువేంద్ర చహల్‌ (2/34) రాణించడంతో కేకేఆర్‌పై ఆర్సీబీ విజయభేరి మోగించింది. తద్వారా ఈ సీజన్‌లో హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదుచేసింది. 

ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్‌ మాక్స్‌వెల్‌ ఇన్నింగ్స్‌పై స్పందించిన గ్రేమ్‌స్వాన్‌ స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘అందరికంటే ఎక్కువగా తను నన్ను ఆశ్చర్యపరిచాడు. బెంగళూరు ఫ్రాంఛైజీ అతడి కోసం మరీ ఎక్కువ మొత్తం ఖర్చు చేసిందని భావించాను. కానీ నా అభిప్రాయం తప్పని అతడు నిరూపించాడు. యాజమాన్యం సైతం తనకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటామంటూ పూర్తి నమ్మకం ఉంచింది. దానిని నిలబెట్టుకున్నాడు. వైఫల్యాల నుంచి బయటపడి పూర్వపు ఫాంలోకి వచ్చాడు. మంచి మంచి షాట్లు ఆడుతున్నాడు. ఇప్పుడు తను చాలా సంతోషంగా ఉంటాడు.

ప్రస్తుతం మాక్సీ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. కాబట్టి మరింత విజయవంతంగా కొనసాగే అవకాశం ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా, కోహ్లి, డివిలియర్స్‌ వంటి కీలక ఆటగాళ్లు జట్టులో ఉన్నపుడు మాక్స్‌వెల్‌ తన సహజమైన ఆటతీరును ప్రదర్శించేందుకు మరిన్ని ఎక్కువ అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డాడు. తన ప్రదర్శనను బిగ్‌ షోగా అభివర్ణించిన స్వాన్‌, జట్టులో మూడో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడని పేర్కొన్నాడు. కాగా గత సీజన్‌లో పంజాబ్‌ తరఫున ఆడిన మాక్స్‌వెల్‌ 13 మ్యాచ్‌లు ఆడి మొత్తంగా 108 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో పంజాబ్‌ అతడిని వదులుకోగా, మినీ వేలం-2021లో భాగంగా ఆర్సీబీ రూ. 14.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో యాజమాన్యం నిర్ణయం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమైంది. గత సీజన్‌లో విఫలమైన ఆటగాడి కోసం భారీ మొత్తం వెచ్చించడం పట్ల రకరకాల కామెంట్లు వినిపించాయి. ఇక మాక్సీ మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా బ్యాట్‌తోనే విమర్శలకు సమాధానం ఇస్తున్నాడు.

స్కోర్లు: ఆర్సీబీ- 204/4 (20)
కేకేఆర్‌- 166/8 (20)

చదవండి: సిరాజ్ మొత్తం మారిపోయాడు: కోహ్లి
ఇంత స్కోరా... నేను అంతే:  ఏబీడీ

మరిన్ని వార్తలు