మాక్సీ మెరుపులు: గట్టిగా హగ్‌ ఇచ్చేవాళ్లం.. కౌంటర్‌ పడిందిగా!

10 Apr, 2021 12:24 IST|Sakshi
తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు మాక్స్‌వెల్‌(ఫొటో కర్టెసీ: ఐపీఎల్‌)

చెన్నై: ‘‘అదేంటో.. అన్ని లీగ్‌ మ్యాచ్‌లలోనూ బాగానే ఆడతాడు కానీ.. ఐపీఎల్‌ అనే సరికి మ్యాక్సీకి ఏమనిపిస్తుందో సరిగ్గా ఆడి చావడు.. ఏం కర్మరా బాబు’’.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌పై సోషల్‌ మీడియాలోఇలాంటి కామెంట్లు, రకరకాల మీమ్స్‌ కొత్తేమీ కాదు. ముఖ్యంగా గత సీజన్‌లో కింగ్స్‌ ఎలెవెన్‌ తరఫున మైదానంలో దిగిన మాక్సీ  13 మ్యాచ్‌లు ఆడి మొత్తంగా 108 పరుగులు మాత్రమే చేయడంతో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. రూ. 10 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన (2019) ఆటగాడు ఇంతలా విఫలమవడం పట్ల అంతా పెదవి విరిచారు.

ఈ క్రమంలో జట్టు ప్రక్షాళనలో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌ అతడిని వదులుకోగా, ఐపీఎల్‌-2021 మినీ వేలంలో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అతడిని సొంతం చేసుకుంది. చెన్నై సూపర్‌కింగ్స్‌తో పోటీపడి మరీ రూ. 14.25 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో విఫలమైన ఆటగాడికి ఇంత పెద్ద మొత్తం దక్కడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమైంది. ఈ క్రమంలో శుక్రవారం నాటి తొలి మ్యాచ్‌లో మాక్స్‌వెల్‌ ఏ మేరకు రాణిస్తాడన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఆర్సీబీ ఓపెనింగ్‌ మ్యాచ్‌లో బరిలోకి దిగిన మాక్సీ.. 39 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇందులో రెండు సిక్సర్లు కూడా ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ముంబై ఇండియన్స్‌పై 2 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో.. ‘‘ఎరుపు, బంగారు వర్ణం కలగలిసిన జెర్సీలో మాక్సి-మమ్‌.. చెన్నైలో అదరగొట్టాడు. పంజాబ్‌ కింగ్స్‌కు ధన్యవాదాలు. ఒకవేళ మీరు గనుక ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక దూరం పాటించనట్లయితే కచ్చితంగా గట్టిగా ఓ హగ్‌ ఇచ్చేవాళ్లం’’ అంటూ ఆర్సీబీ సోషల్‌ మీడియా వింగ్‌ ట్వీట్‌ చేసింది. ఇందుకు, పంజాబ్‌ కింగ్స్‌ సైతం దీటుగానే బదులిచ్చింది. ‘‘ మీకు కూడా థాంక్యూ చెప్పాలి. గేల్‌, కేఎల్‌ రాహుల్‌, మాండీ, సర్ఫరాజ్‌, మయాంక్‌ అగర్వాల్‌(గతంలో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించారు)ను ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అంటూ కౌంటర్‌ వేసింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల అభిమానులు సోషల్‌ మీడియాలో వివిధ రకాల మీమ్స్‌, ఫన్నీ వీడియోలతో హల్‌చల్‌ చేస్తున్నారు. 

చదవండి: ఒక కెప్టెన్‌గా ఏం ఆశించానో.. అదే చేశాడు ‌: కోహ్లి
అందుకే హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ చేయలేదు..!
ఆర్సీబీ జట్టు ఇదే!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు