Daniel Christian: ఆర్సీబీని ముంచేశారు కదరా; ప్లీజ్‌.. నా భార్యను వదిలేయండి!

12 Oct, 2021 13:23 IST|Sakshi

Daniel Christian and his partner face flak on social media: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఆటగాడు డేనియల్‌ క్రిస్టియాన్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన భార్యను వేధించవద్దని నెటిజన్లకు విజ్ఞప్తి చేశాడు. దయచేసి ఆమెను వదిలేయమంటూ అర్థించాడు. ‘‘నా భాగస్వామి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుకు సంబంధించిన ఆ కామెంట్లు చూడండి. నిన్నటి మ్యాచ్‌లో నేను బాగా ఆడలేదు. కానీ ఆటను ఆటలాగే చూడండి. దయచేసి తనను వదిలేయండి’’అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

కాగా ఐపీఎల్‌-2021లో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో భాగంగా ఆర్సీబీ.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్రిస్టియాన్‌ వేసిన 12వ ఓవర్లో 3 సిక్స్‌లతో కేకేఆర్‌ ఆటగాడు నరైన్‌ 22 పరుగులతో చెలరేగడంతో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. ఫలితంగా కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ పరాజయం పాలైంది.

ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లు క్రిస్టియాన్‌, అతడి భార్య డియానా అట్సలాస్‌ను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. ‘‘ఈ మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు డియానా డాన్‌ క్రిస్టియాన్‌కే.. అసలు ఏం చేశావమ్మా... ఆర్సీబీని పుట్టిముంచేశారు’’ అంటూ అభ్యంతరకర పదజాలంతో దూషించారు. అంతేగాకుండా.. ‘‘ఈ సీజన్‌లో మొదటిసారి క్రిస్టియన్‌ స్కోరు.. ఒకటి దాటిందిరోయ్‌. గ్రేట్‌’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

మరికొందరు మాత్రం.. ‘‘క్రిస్టియాన్‌ భార్యతో ఈ మ్యాచ్‌కు సంబంధమే లేదు. అలాంటప్పుడు ఆమెను ఎందుకు విమర్శిస్తున్నారు. తను ప్రస్తుతం గర్భవతి అనుకుంటా. పాపం వాళ్లను మానసికంగా వేధించకండి’’అంటూ అండగా నిలుస్తున్నారు. కాగా సోమవారం నాటి మ్యాచ్‌లో క్రిస్టియన్‌ 8 బంతులు ఎదుర్కొని 9 పరుగులు చేశాడు. 1.4 ఓవర్లలో.. 29 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక క్రిస్టియాన్‌పై జరుగుతున్న ట్రోలింగ్‌కు ఆర్సీబీ మరో ప్లేయర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.  

చదవండి: T20 World Cup: రషీద్‌ ఖాన్‌ టాప్‌-5 టీ20 క్రికెటర్ల లిస్టు.. ఎవరెవరంటే!

>
మరిన్ని వార్తలు