ముంబై, చెన్నై పోరుతో...

26 Jul, 2021 06:41 IST|Sakshi

సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈలో ఐపీఎల్‌ పునఃప్రారంభం

అక్టోబర్‌ 15న దుబాయ్‌లో ఫైనల్‌  

న్యూఢిల్లీ: భారత్‌లో మిగిలిపోయిన ఈ సీజన్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో షెడ్యూల్‌ ఖరారైంది. దుబాయ్‌లో సెప్టెంబర్‌ 19న డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ మ్యాచ్‌తో ఐపీఎల్‌–14 పునఃప్రారంభం కానుంది. మొత్తం 31 మ్యాచ్‌ల్ని 27 రోజుల వ్యవధిలో నిర్వహిస్తామని, ఇందులో ఏడు రోజులు రెండేసి మ్యాచ్‌లు జరుగుతాయని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. యూఏఈలోని మూడు వేదికలైన దుబాయ్‌లో 13, షార్జాలో 10, అబుదాబిలో 8 మ్యాచ్‌లు జరుగుతాయి.

రెండు మ్యాచ్‌లుంటే తొలి మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు, రెండో మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు మొదలవుతుంది. బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య అక్టోబర్‌ 8న జరిగే మ్యాచ్‌తో లీగ్‌ దశ ముగుస్తుంది. అనంతరం 10న దుబాయ్‌లో తొలి క్వాలిఫయర్, 11న ఎలిమినేటర్‌తోపాటు 13న రెండో క్వాలిఫయర్‌ షార్జాలో జరుగుతుంది. అక్టోబర్‌ 15న దుబాయ్‌లో జరిగే ఫైనల్‌తో ఐపీఎల్‌ ముగుస్తుంది. యూఏఈ ప్రభుత్వం అనుసరిస్తున్న క్వారంటైన్, ప్రొటోకాల్‌ నిబంధనల్ని ఆటగాళ్లు, నిర్వాహకులు పాటించాలి. కోవిడ్‌తో ఆలస్యమైన గత సీజన్‌ మ్యాచులన్నీ  యూఏఈలోనే నిర్వహించారు. భారత్‌లో మొదలైన ఈ సీజన్‌ మేలో కరోనా కేసుల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు