IPL 2021: అహ్మదాబాద్‌లో ఆగిన ఆట

19 Sep, 2021 05:07 IST|Sakshi

దుబాయ్‌లో మళ్లీ మొదలు

నేటి నుంచి ఐపీఎల్‌–2021 రెండో దశ మ్యాచ్‌లు

చెన్నైతో ముంబై ఇండియన్స్‌ ‘ఢీ’

రాత్రి గం.7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

కరోనా దెబ్బతో అర్ధాంతరంగా ఆగిన ఐపీఎల్‌ అభిమానులను అలరించేందుకు మరోసారి వచ్చేసింది. 2020లో యూఏఈలో విజయవంతంగా నిర్వహించినా... బీసీసీఐ అతి విశ్వాసం కారణంగా ఈ ఏడాది భారత్‌లోనే లీగ్‌ మొదలైంది. చివరకు కోవిడ్‌ దెబ్బకు టోర్నీని సగంలోనే ఆపి వేయాల్సి వచి్చంది. అయితే లీగ్‌తో ముడిపడి ఉన్న వేల కోట్ల రూపాయలను దృష్టిలో ఉంచుకుంటూ మళ్లీ యూఏఈనే నమ్ముకున్న బోర్డు, విరామం తర్వాత మళ్లీ పోటీలను నిర్వహించేందుకు సన్నద్ధమైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య నేడు జరిగే పోరుతో లీగ్‌ పునః ప్రారంభం కానుంది.  

దుబాయ్‌: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో మే 2న అహ్మదాబాద్‌లో ఢిల్లీ, పంజాబ్‌ జట్ల మధ్య చివరి మ్యాచ్‌ జరిగింది. మే 4న కోల్‌కతా, బెంగళూరు మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉండగా... నైట్‌రైడర్స్‌ టీమ్‌లోని వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌ కరోనా పాజిటివ్‌గా తేలారు. దాంతో ఆ మ్యాచ్‌ను షెడ్యూల్‌ నుంచి తప్పించిన గవరి్నంగ్‌ కౌన్సిల్‌ తర్వాతి రోజు లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేసింది. ఆపై మన దేశంలో కరోనా రెండో వేవ్‌ ఉధృతంగా కొనసాగడంతో భారత్‌లో టోర్నీ నిర్వహణ అసాధ్యమని తేలిపోయింది. దాంతో చర్చోపర్చల అనంతరం భారత మ్యాచ్‌ల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుంటూ బీసీసీఐ రెండో దశ పోటీల షెడ్యూల్‌ విడుదల చేసింది. సుదీర్ఘ ఇంగ్లండ్‌ పర్యటన అనంతరం ఇప్పుడు ధనాధన్‌ క్రికెట్‌తో సగటు అభిమానులకు ధనాధన్‌ వినోదం లభించనుంది.  

అక్టోబర్‌ 15న ఫైనల్‌...
ఒక్కో సీజన్‌ ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్‌ సహా మొత్తం 60 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీ అర్ధాంతరంగా ఆగిపోయే సమయానికి 29 మ్యాచ్‌లు ముగిశాయి. అంటే 27 రోజుల్లో మిగిలిన 31 మ్యాచ్‌లను బీసీసీఐ నిర్వహించనుంది. తొలి దశతో పోలిస్తే వేదికలు మారడమే కాకుండా పలు జట్లలో కూడా మార్పులు జరిగాయి. వ్యూహ ప్రతివ్యూహాల్లో కూడా ఆ తేడా కనిపిస్తుంది కాబట్టి తొలి దశలో జోరు ప్రదర్శించిన జట్లు ఇక్కడా దానినే కొనసాగించగలవా లేదా అనేది ఆసక్తికరం. పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న టీమ్‌లు కూడా పుంజుకునేందుకు ఆస్కారం ఉంది.

ప్రతీ జట్లలో కొందరు కీలక ఆటగాళ్లు టోర్నీకి దూరమయ్యారు. తొలి దశలో ఆడిన ప్యాట్‌ కమిన్స్‌ (కోల్‌కతా), స్టోక్స్, బట్లర్‌ (రాజస్తాన్‌), బెయిర్‌స్టో (సన్‌రైజర్స్‌), వోక్స్‌ (ఢిల్లీ), వాషింగ్టన్‌ సుందర్‌ (బెంగళూరు) వేర్వేరు కారణాలతో ఇప్పుడు బరిలోకి దిగడం లేదు. తొలి దశ పోటీలకు దూరమైన శ్రేయస్‌ అయ్యర్, నటరాజన్‌ ఈసారి ఆడనుండగా... షమ్సీ, హసరంగ, చమీరా, గ్లెన్‌ ఫిలిప్స్, నాథన్‌ ఎలిస్, రషీద్, టిమ్‌ డేవిడ్, లూయీస్‌లాంటి ఆటగాళ్లు ఐపీఎల్‌లో కొత్తగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దుబాయ్, అబుదాబి, షార్జా నగరాల్లో జరిగే ఈ మ్యాచ్‌లలో స్థానిక ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తుండటం విశేషం.

మరిన్ని వార్తలు