అప్పుడు 12.5 కోట్లు; ఇప్పుడు మరీ ఇంత తక్కువ ధర: పాంటింగ్‌‌

7 Apr, 2021 10:49 IST|Sakshi

న్యూఢిల్లీ: తక్కువ ధరకే  స్టీవ్‌ స్మిత్‌ తమ జట్టు సొంతమవుతాడని భావించలేదని ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌, ఆసీస్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ అన్నాడు. ఐపీఎల్‌-2021 సీజన్‌లో అతడు తప్పకుండా రాణిస్తాడని, తన సత్తా ఏంటో నిరూపించుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా రూ. 12.4 కోట్లు వెచ్చించి స్మిత్‌ను కొనుగోలు చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు, గత సీజన్‌ ముగిసిన అనంతరం అతడిని విడుదల చేయడమే గాకుండా, సంజూ శాంసన్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. స్మిత్‌ నేతృత్వంలోని రాజస్తాన్‌ రాయల్స్‌ గతేడాది 14 మ్యాచ్‌లాడి 6 విజయాలు, 8 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. బ్యాట్స్‌మన్‌గా 14 మ్యాచ్‌ల్లో 311 పరుగుల సాధించిన స్మిత్‌ బ్యాట్స్‌మెన్‌గానూ ఆకట్టుకోలేకపోయాడు. దీంతో యాజమాన్యం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలో ఇటీవల చెన్నైలో జరిగిన మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్మిత్‌ను రూ. 2.2 కోట్లకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో రికీ పాంటింగ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇంత తక్కువ ధరకే మేం స్మితీని దక్కించుకుంటామని అనుకోలేదు. సుదీర్ఘ కాలంగా అతడిని కొనసాగించిన ఫ్రాంఛైజీ ఈ సీజన్‌లో తనను వదులుకుంది. నిజానికి తను ఆట మీద కసితో ఉన్నాడు. ఈసారి కచ్చితంగా పరుగుల వరద పారిస్తాడు. వచ్చే ఏడాది మెగా వేలం ఉంటుందన్న సంగతి తనకు తెలుసు. కాబట్టి ఈ సీజన్‌లో బాగా రాణిస్తే,  తనను కొనుగోలు చేసేందుకు భవిష్యత్తులో పెద్దమొత్తం ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుందేమో!’’ అని చెప్పుకొచ్చాడు.

ఇక వేలం జరుగుతున్న సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానన్న పాంటింగ్‌... ‘‘ఫ్రాంఛైజీ యజమానులతో ఆరోజు ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాను. ఇంతలో స్మిత్‌ కోసం బిడ్‌ వేసినట్లు తెలిసింది. వెనువెంటనే డీసీ అతడిని కొనుగోలు చేసిందనే ప్రకటన కూడా వెలువడింది. స్మిత్‌ అనుభవం, తన క్లాసిక్‌ ఆట మా జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు’’ అని స్టీవ్‌ స్మిత్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా రాజస్తాన్‌ రాయల్స్‌ స్మిత్‌ను వదులుకున్న తర్వాత రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ పోటీపడగా, డీసీ అతడిని సొంతం చేసుకుంది. ఇక ఏప్రిల్‌ 10న తమ తొలి మ్యాచ్‌లో డీసీ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడనుంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ గాయం కారణంగా దూరం కావడంతో, టీమిండియా యువ కెరటం రిషభ్‌ పంత్‌ సారథ్యంలో ముందుకు సాగనుంది.

చదవండి: ధోని బాయ్‌ జట్టుతో తొలి మ్యాచ్‌.. అది కెప్టెన్‌గా
ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఇదే.. పూర్తి వివరాలు

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు