మొన్నేమో అలా.. ఇప్పుడేమో ఇలా.. ఏంటి రోహిత్‌

14 Apr, 2021 16:07 IST|Sakshi
కర్టసీ: ఐపీఎల్‌/ ఇన్‌స్టాగ్రామ్‌

చెన్నై: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత రోహిత్‌ శర్మది. రోహిత్‌ ఫాంలో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనబడతాయి. బంతిని బలంగా బాదే రోహిత్‌లో కొన్ని తెలియని విషయాలు ఈ ఐపీఎల్‌ సీజన్‌లో మన ముందు కనిపిస్తున్నాయి. మ్యాచ్‌లు గెలిపించడంలోనే కాదు.. పర్యావరణాన్ని కాపాడడంలోనూ రోహిత్‌ ముందు వరుసలో ఉంటున్నాడు. మొన్న ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ తన షూపై ''సేవ్‌ ది రైనోస్''‌ అని రాసుకొని.. అంతరించిపోతున్న వాటిని కాపాడాల్సిన అవసరం ఉందంటూ సందేశాన్ని అందించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా మంగళవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ మరో అంశంతో ముందుకొచ్చాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌కు రోహిత్‌ శర్మ తన కాలి షూపై ''ప్లాస్టిక్‌ ఫ్రీ ఓషన్''‌ అని రాసుకొని సముద్రాలను ప్లాస్టిక్‌ ఫ్రీ చేద్దామంటూ అవగాహన కల్పించాడు. మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ శర్మ స్పందిస్తూ..'' ప్రస్తుత ప్రపంచంలో ప్లాస్టిక్‌ అనేది ఒక భూతంలా తయారైంది. దానిని తరిమికొట్టకుంటే ప్రకృతిని మన చేతులారా మనం నాశనం చేసుకున్నట్లే. ఎందుకో ఈ అంశం నా మనుసును తాకింది.. అయితే ప్లాస్టిక్‌ అనే భూతాన్ని వంద శాతం కంట్రోల్‌ చేయడం మనచేతుల్లోనే ఉంది. నేను ఈరోజు నుంచి దానిని తరిమి కొట్టేందుకు సిద్ధమవుతున్నా.. మీరు నా వెంట వస్తారని ఆశిస్తున్నా.. రండి ప్లాస్టిక్‌ భూతాన్ని తరుముదాం.. సముద్రాలను పరిశుభ్రం చేద్దాం.''అంటూ ట్విటర్‌ వేదికగా పిలుపునిచ్చాడు.

అయితే రోహిత్‌ పెట్టిన అంశం మరోసారి సోషల్‌ మీడియాను ఊపేస్తుంది. ''ఈ సీజన్‌లో రోహిత్‌లో కొత్త యాంగిల్స్‌ చాలా చూస్తున్నాం.. రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని చూడాలో.. మొన్న రైనోస్‌.. ఇవాళ ప్లాస్టిక్‌.. రేపేంటి.. మొన్నేమో అలా.. ఇప్పుడేమో ఇలా.. ఏంటి రోహిత్‌.. మా కెప్టెన్‌ మ్యాచ్‌ను గెలిపించడమే కాదు.. పర్యావరణం కాపాడడంలోనూ ముందుంటాడు.'' అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.  


కర్టసీ: ఐపీఎల్‌/ ఇన్‌స్టాగ్రామ్‌

ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌటైంది. టాపార్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (36 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (32 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మెరిపించారు. రసెల్‌ (5/15) ముంబైని అనూహ్యంగా కట్టడి చేశాడు. తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. ఇక్కడా టాపార్డరే ఆడింది. నితీశ్‌ రాణా (47 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుబ్‌మన్‌ గిల్‌ (24 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణిస్తే మిగతా వారెవరూ కనీసం పట్టుమని పది పరుగులైనా చేయలేకపోయారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రాహుల్‌ చహర్‌ (4/27) తన స్పిన్‌తో కోల్‌కతాను తిప్పేశాడు. 
చదవండి: చెన్నైలో అదొక ట్రెండ్‌: రోహిత్‌

రనౌట్‌ అయితే అయ్యావు.. కానీ మనసులు గెలుచుకున్నావ్

మరిన్ని వార్తలు