రోహిత్‌ షూపై ఈసారి ఏం రాసుకొచ్చాడో తెలుసా.. 

18 Apr, 2021 15:53 IST|Sakshi
Courtesy: Rohit Sharma Instagaram

చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 32 పరుగులు సాధించాడు. ఈ విషయం పక్కనపెడితే.. ఈ సీజన్‌లో మొదటి నుంచి రోహిత్‌ శర్మ ప్రతీ  మ్యాచ్‌లోనూ తన కాలి షూపై ఏదో ఒక అంశంతో ముందుకు వచ్చి అవగాహన కల్పిస్తూ వచ్చాడు. ఆర్‌సీబీతో జరిగిన మొదటి మ్యాచ్‌కు ''సేవ్‌ ది రైనోస్''‌.. కేకేఆర్‌తో మ్యాచ్‌కు ''ప్లాస్టిక్‌ ఫ్రీ ఓషన్‌'' అంశంతో ముందుకు వచ్చాడు. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌కు రోహిత్‌ తన కాలి షూపై ''సేవ్‌ ది కోరల్స్''‌ రాసుకొని బరిలోకి దిగాడు. మ్యాచ్‌ విజయం అనంతరం రోహిత్‌ శర్మ ఇన్‌స్టాలో కారణం చెప్పుకొచ్చాడు.

''మన భూమి మీద నివసిస్తున్నా.. సముద్రాలు మనలో భాగమే. మొదట్లో సముద్రం అనే పదం వింటే చాలా భయపడిపోయేవాడిని. కానీ సముద్రంలో ఉన్న జీవం గురించి తెలుసుకున్నాకా వాటిని కాపాడాలనేది మన బాధ్యత అని తెలుసుకున్నా. అందుకే సముద్రంలో ఉండే జీవాలను కాపాడేందుకు ప్రత్యేక చొరవ చూపుదాం. మనకున్న మహాసముద్రాలను రక్షించడం అంటే మన భవిష్యత్తును రక్షించడం'' అంటూ కామెంట్‌ చేశాడు. రోహిత్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఈ మెసేజ్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది.

ఇక శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 13 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్‌ డికాక్‌ (39 బంతుల్లో 40; 5 ఫోర్లు) రాణించాడు. హైదరాబాద్‌ బౌలర్లలో ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్, విజయ్‌ శంకర్‌ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్‌ 19.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. బెయిర్‌స్టో (22 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) కాసేపే ఉన్నా కసిదీరా బాదేశాడు. రాహుల్‌ చహర్‌ (3/19) స్పిన్‌ మాయాజాలం, బౌల్ట్‌ (3/28) పేస్‌ అటాక్‌ ముంబైని విజేతగా నిలబెట్టాయి.
చదవండి: మొన్నేమో అలా.. ఇప్పుడేమో ఇలా.. ఏంటి రోహిత్‌
రనౌట్‌ అయితే అయ్యావు.. కానీ మనసులు గెలుచుకున్నావ్

A post shared by Rohit Sharma (@rohitsharma45)

మరిన్ని వార్తలు