ఏడేళ్ల తర్వాత రోహిత్‌.. ఇది వ్యూహం కాదంటారా?

14 Apr, 2021 07:31 IST|Sakshi
Photo Courtesy: Mumbai Indians Twitter

చెన్నై: ముంబై ఇండియన్స్‌ ఐదుసార్లు ఐపీఎల్‌ ట్రోఫీని గెలిచిందంటే అది కేవలం జట్టు బలంగా ఉండటం వల్ల మాత్రమే వచ్చింది కాదు. సారథిగా రోహిత్‌ శర్మ కూడా కచ్చితమైన ప్రణాళికల్ని అమలు చేయడమే. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఎలా గెలిపించాలో మరోసారి రుజువు చేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌ను ముంబై గెలిచిందంటే కెప్టెన్‌గా రోహిత్‌ మరింత పరిణితిని కనబరచడమే. మ్యాచ్‌ ఓడిపోయే దశ నుంచి గెలుపు తీరాలకు వెళ్లిందంటే అది రోహిత్‌ వ్యూహ రచనే.

ప్రత్యర్థి జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే ముంబై ఇండియన్స్‌ ఇద్దరు స్పిన్నర్లకే పరిమితమైంది. మ్యాచ్‌ ఆరంభమైన తర్వాత మరొక స్పిన్నర్‌ను ముంబై తీసుకుని ఇంత ఒత్తిడి ఉండేది మ్యాచ్‌ విశ్లేషకుల సైతం అభిప్రాయపడ్డారు. ప్రధానంగా రెండో ఇన్నింగ్స్‌లో పిచ్‌ బాగా నెమ్మదించి స్పిన్నర్లకు అనుకూలించిన విషయం రాహుల్‌ చాహర్‌, కృనాల్‌ పాండ్యాల బౌలింగ్‌ను బట్టి అర్థమైంది.

చాహర్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో నాలుగు వికెట్లు సాధించి 27 పరుగులే ఇవ్వగా, కృనాల్‌ పాండ్యా 4 ఓవర్లు పూర్తి చేసి 1 వికెట్‌ సాధించాడు. ఇక్కడ కృనాల్‌ ఇచ్చిన పరుగులు 13. ఈ ఇద్దరే ముంబై ఇండియన్స్‌ గెలుపులో ప్రధాన పాత్ర ధారులు. కీరోన్‌ పొలార్డ్‌కు ఒక ఓవర్‌, లెఫ్టార్మ్‌ పేసర్‌ మార్కో జాన్సన్‌ చేత రెండు ఓవర్లు మాత్రమే రోహిత్‌ వేయించాడు. వీరి బౌలింగ్‌లో ఎదురుదాడి చేసే అవకాశం ఉండటంతో రోహిత్‌ శర్మనే ఒక ఓవర్‌ వేశాడు.

Photo Courtesy: Mumbai Indians Twitter

ప్రధానంగా చాహర్‌, కృనాల్‌ల చేత పూర్తి కోటాలు వేయించి చివరి రెండు ఓవర్లను బుమ్రా, బౌల్ట్‌లు చేత మాత్రమే బౌలింగ్‌ చేయించాలని డిసైడ్‌ అయిన రోహిత్‌.. 14 ఓవర్‌ను వేయడానికి సిద్దమయ్యాడు. అక్కడ పార్ట్‌ టైం‌ బౌలర్‌ రూపంలో స్పిన్‌ బౌలింగ్‌ వేస్తేనే తన వ్యూహం వర్కౌట్‌ అవుతుంది. ఇదే వ్యూహాన్ని అమలు చేశాడు రోహిత్‌. ఐపీఎల్‌లో ఏడేళ్ల తర్వాత బంతిని అందుకున్నాడంటే రోహిత్‌ మ్యాచ్‌ను ఎంత సీరియస్‌గా తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. 2014 ఐపీఎల్‌లో రోహిత్‌ బౌలింగ్‌ వేయగా, మళ్లీ ఇన్నాళ్లకు బంతిని చేతిలోకి తీసుకున్నాడు.

14 ఓవర్‌ను వేసిన రోహిత్‌.. తొలి బంతికే షకీబుల్‌ను బౌల్ట్‌ చేసినంత పనిచేశాడు. అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ వేసిన బంతి షకీబుల్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని, ఆఫ్‌ స్టంప్‌కు పక్కనుంచి ఫోర్‌కు మళ్లింది. ఆ తర్వాత మిగతా బంతులు సింగిల్స్‌ మాత్రమే ఇచ్చాడు రోహిత్‌. సుదీర్ఘ విరామం తర్వాత బౌలింగ్‌ వేసినా రానా, షకీబుల్‌లకు భారీ షాట్లు కొట్టే అవకాశం ఇవ్వలేదు. రోహిత్‌ 14 ఓవర్‌ వేసే సమయానికి కేకేఆర్‌ మూడు వికెట్లు కోల్పోయి 104 పరుగులతో స్ట్రాంగ్‌ పొజిషన్‌లో ఉంది. అయినా రోహిత్‌ రిస్క్‌ చేసి బౌలింగ్‌ తీసుకున్నాడంటే అక్కడే అతని ప్రణాళికలో పదునుకు తార్కాణం. ఆ ఓవర్‌ తొలి బంతికి రోహిత్ కాలి పాదం మెలిక పడ్డా తిరిగి బౌలింగ్‌ కొనసాగించడం పోరాటస్ఫూర్తికి నిదర్శనం. 

ఇక్కడ చదవండి: ఐపీఎల్‌ 2021: ముంబై సూపర్‌ విక్టరీ
మొన్న హర్షల్‌.. ఈరోజు రసెల్‌.. మళ్లీ అదే జట్టు

>
మరిన్ని వార్తలు