IPL 2021, RCB vs RR: పడిక్కల్‌ ఫటాఫట్‌...

23 Apr, 2021 04:45 IST|Sakshi

52 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101 నాటౌట్‌

మెరిసిన విరాట్‌ కోహ్లి బంతితో హడలెత్తించిన సిరాజ్, హర్షల్‌

రాజస్తాన్‌ రాయల్స్‌పై 10 వికెట్లతో బెంగళూరు గెలుపు

ఈ సీజన్‌లో కోహ్లి జట్టుకు వరుసగా నాలుగో విజయం

అందని ద్రాక్షలా ఉన్న ఐపీఎల్‌ టైటిల్‌ను ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఈ సీజన్‌లో మరో ఘనవిజయం సాధించింది. ముందు బంతితో హడలెత్తించి... ఆ తర్వాత బ్యాట్‌తో గర్జించి... ఈ సీజన్‌లో వరుసగా నాలుగో విజయంతో ‘టాప్‌’లోకి వెళ్లింది. సిరాజ్, హర్షల్‌ పటేల్‌ బంతితో మెరిపించగా... ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్లను చితగ్కొట్టి తన ఖాతాలో తొలి శతకాన్ని జమ చేసుకున్నాడు. దేవ్‌దత్‌కు కెప్టెన్‌ కోహ్లి అండగా నిలువడంతో బెంగళూరు వికెట్‌ నష్టపోకుండానే లక్ష్యాన్ని ఛేదించి రాజస్తాన్‌ రాయల్స్‌ను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. 
 
ముంబై: మరోసారి స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబరిచిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఐపీఎల్‌–14 సీజన్‌లో తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వాంఖెడే స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లి బృందం 10 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించింది. 178 పరుగుల ఛేజింగ్‌లో ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ అజేయ శతకం (52 బంతుల్లో 101 నాటౌట్‌; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు)తో కదం తొక్కగా... కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (47 బంతుల్లో 72 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అతడికి సహకరించాడు.

దాంతో బెంగళూరు 16.3 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 181 పరుగులు చేసి అలవోకగా గెలిచింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఒకదశలో బెంగళూరు బౌలర్‌ సిరాజ్‌ (3/27) ధాటికి 43/4తో కష్టాల్లో ఉన్న రాజస్తాన్‌ను శివమ్‌ దూబే (32 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్‌ తెవాటియా (23 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) తమ వీరోచిత పోరాటంతో జట్టుకు భారీ స్కోరును అందించారు. మరో బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ మూడు వికెట్లు తీశాడు.  

వికెట్‌ చేజార్చుకోకుండా...
రాజస్తాన్‌ ఆపసోపాలు పడుతూ సాధించిన స్కోరును బెంగళూరు ఓపెనర్లు ఆడుతూ పాడుతూ కొట్టేశారు. రాజస్తాన్‌ సారథి సామ్సన్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ను లెగ్‌ స్పిన్నర్‌ శ్రేయస్‌ గోపాల్‌తో వేయించగా... మొదటి మూడు బంతులను ఆచితూచి ఆడిన కోహ్లి నాలుగో బంతిని సిక్సర్‌ కొట్టి బెంగళూరు స్కోరు బోర్డును తెరిచాడు. అనంతరం పడిక్కల్‌ మూడు ఓవర్ల వ్యవధిలో ఏకంగా ఐదు ఫోర్లు బాది తన బ్యాటింగ్‌ సత్తాను ప్రదర్శించాడు. బౌలర్‌ ఎవరైనా సరే కొడితే సిక్సర్‌ లేదా ఫోర్‌ అన్నట్లు పడిక్కల్‌ ఇన్నింగ్స్‌ సాగింది. దాంతో మరో ఎండ్‌లో ఉన్న కోహ్లి... పడిక్కల్‌కే ఎక్కువగా స్ట్రయికింగ్‌ ఇస్తూ ప్రోత్సహించాడు. ఈ క్రమంలో ఎనిమిదో ఓవర్‌ మూడో బంతిని ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా ఫోర్‌ కొట్టిన పడిక్కల్‌ 27 బంతుల్లో అర్ధ శతకాన్ని సాధించాడు.

9వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, పదో ఓవర్‌లో మరో సిక్సర్‌ బాదిన పడిక్కల్‌ దెబ్బకు 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 107/0గా నిలిచింది. ఇక ఇక్కడి నుంచి నా వంతు అంటూ కోహ్లి మెరుపులు మెరిపించడం మొదలు పెట్టాడు. పడిక్కల్‌లా భారీ సిక్సర్లు బాదకపోయినా... కచ్చితమైన టైమింగ్‌తో చూడ చక్కటి షాట్లతో బౌండరీలను రాబడుతూ కోహ్లి 34 బంతుల్లో హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పడిక్కల్‌ శతకానికి చేరువగా రావడంతో కోహ్లి భారీ షాట్లకు వెళ్లకుండా సింగిల్స్‌ తీస్తూ స్ట్రయిక్‌ను రోటేట్‌ చేశాడు. ఈ క్రమంలో ముస్తఫిజుర్‌ వేసిన 17వ ఓవర్‌ తొలి బంతిని ఎక్స్‌ట్రా కవర్‌లో బౌండరీ బాదిన పడిక్కల్‌... 51 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఇది అతడి ఐపీఎల్‌ కెరీర్‌లో తొలి సెంచరీ కావడం విశేషం. ఇక అదే ఓవర్‌లో బెంగళూరు విజయాన్ని అందుకుంది.

నిలబెట్టిన భాగస్వామ్యం
అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ బ్యాట్స్‌మెన్‌ను బెంగళూరు బౌలర్లు హడలెత్తించారు. రెండు బౌండరీలు సాధించి ఊపు మీదున్న బట్లర్‌ (8)తో పాటు డేవిడ్‌ మిల్లర్‌ (0)ను సిరాజ్‌ అవుట్‌ చేయగా... మనన్‌ వొహ్రా (7) వికెట్‌ను జేమీసన్‌ దక్కించుకోవడంతో రాజస్తాన్‌ 18 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్‌ సామ్సన్‌ (18 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రెండు ఫోర్లతో పాటు వాషింగ్టన్‌ సుందర్‌ ఓవర్‌లో డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా భారీ సిక్సర్‌ కొట్టి జట్టును ఆదుకునేలా కనిపించాడు. అయితే ఒక స్లో డెలివరీతో సామ్సన్‌ను బోల్తా కొట్టించిన వాషింగ్టన్‌ సుందర్‌ బెంగళూరుకు నాలుగో వికెట్‌ అందించాడు. అయితే ఇక్కడి నుంచే ఒక అద్భుత పోరాటం మొదలైంది.

యువ ప్లేయర్లు శివమ్‌ దూబే, రియాన్‌ పరాగ్‌ (16 బంతుల్లో 25; 4 ఫోర్లు) బెంగళూరు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ రాజస్తాన్‌ స్కోరు బోర్డును నడిపించారు. ఈ క్రమంలో 12.2 ఓవర్లలో రాజస్తాన్‌ 100 పరుగుల మార్కును అందుకుంది. హర్షల్‌ పటేల్‌ వేసిన ఆ మరుసటి ఓవర్లో హెలికాప్టర్‌ షాట్‌తో లాంగాన్‌ మీదుగా బౌండరీని సాధించిన పరాగ్‌... ఆ తర్వాతి బంతికే పెవిలియన్‌ చేరాడు. దాంతో దూబే, పరాగ్‌ల 66 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది. తెవాటియా వచ్చీ రావడంతోనే సిక్సర్‌ కొట్టి ఖాతా తెరిచాడు. బంతి వ్యవధిలో మరో ఫోర్‌ కొట్టి బెంగళూరు బౌలర్లకు హెచ్చరికలు జారీ చేశాడు. అయితే అర్ధసెంచరీ వైపు దూసుకెళ్తున్న దూబే... రిచర్డ్‌సన్‌ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. చివర్లో తెవాటియా బౌండరీలతో వేగంగా పరుగులు సాధించడంతో రాజస్తాన్‌  ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్నే ఉంచగలిగింది.  

స్కోరు వివరాలు
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: బట్లర్‌ (బి) సిరాజ్‌ 8; మనన్‌ వొహ్రా (సి) రిచర్డ్‌సన్‌ (బి) జేమీసన్‌ 7; సంజూ సామ్సన్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) సుందర్‌ 21; డేవిడ్‌ మిల్లర్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్‌ 0; శివమ్‌ దూబే (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) రిచర్డ్‌సన్‌ 46; రియాన్‌ పరాగ్‌ (సి) చహల్‌ (బి) హర్షల్‌ పటేల్‌ 25; రాహుల్‌ తెవాటియా (సి) షహబాజ్‌ అహ్మద్‌ (బి) సిరాజ్‌ 40; క్రిస్‌ మోరిస్‌ (సి) చహల్‌ (బి) హర్షల్‌ పటేల్‌ 10; శ్రేయస్‌ గోపాల్‌ (నాటౌట్‌) 7; చేతన్‌ సకారియా (సి) డివిలియర్స్‌ (బి) హర్షల్‌ పటేల్‌ 0; ముస్తఫిజుర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 177.
వికెట్ల పతనం: 1–14, 2–16, 3–18, 4–43, 5–109, 6–133, 7–170, 8–170, 9–170.  
బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–27–3; జేమీసన్‌ 4–0–28–1; రిచర్డ్‌సన్‌ 3–0–29–1; యజువేంద్ర చహల్‌ 2–0–18–0; వాషింగ్టన్‌ సుందర్‌ 3–0–23–1; హర్షల్‌ పటేల్‌ 4–0–47–3.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (నాటౌట్‌) 72; దేవ్‌దత్‌ పడిక్కల్‌ (నాటౌట్‌) 101; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (16.3 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 181.
బౌలింగ్‌: శ్రేయస్‌ గోపాల్‌ 3–0–35–0; చేతన్‌ సకారియా 4–0–35–0; క్రిస్‌ మోరిస్‌ 3–0–38–0; ముస్తఫిజుర్‌ 3.3–0–34–0; తెవాటియా 2–0–23–0; పరాగ్‌ 1–0–14–0.  

► ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన జట్టుగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నిలిచింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ మొత్తం 14 సెంచరీలు చేశారు. 13 సెంచరీలతో పంజాబ్‌ కింగ్స్‌ రెండో స్థానంలో ఉంది.
► ఐపీఎల్‌ చరిత్రలో 10 వికెట్ల తేడాతో నాలుగుసార్లు గెలిచిన ఏకైక జట్టు బెంగళూరు.
► ఐపీఎల్‌లో సెంచరీ చేసిన మూడో పిన్న వయస్కుడిగా పడిక్కల్‌ (20 ఏళ్ల 289 రోజులు) నిలిచాడు. మనీశ్‌ పాండే (19 ఏళ్ల 253 రోజలు; 2009లో), పంత్‌ (20 ఏళ్ల 218 రోజులు; 2018లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
► పంజాబ్‌ కింగ్స్‌ ప్లేయర్‌ పాల్‌ వాల్తాటీ (2011లో చెన్నైపై) తర్వాత భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించకుండా ఐపీఎల్‌లో సెంచరీ చేసిన రెండో క్రికెటర్‌ దేవ్‌దత్‌.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు