కోహ్లి లేకుండానే ఆర్‌సీబీ ప్రాక్టీస్‌ ప్రారంభం

30 Mar, 2021 21:42 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్‌ 2021 సన్నాహకాల్లో భాగంగా తొమ్మిది రోజుల ప్రాక్టీస్‌ సెషన్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) మంగళవారం ప్రారంభించింది. హెడ్‌ కోచ్‌ సైమన్‌ కటిచ్‌, క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ మైక్‌ హెస్సన్‌ మార్గదర్శకత్వంలో స్పిన్నర్‌ యుజువేంద్ర చహల్‌, పేసర్లు నవదీప్‌ సైనీ, మహ్మద్‌ సిరాజ్‌ సహా 11 మంది ఆటగాళ్లు సాధన మొదలు పెట్టారు. కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రతిపాదించిన ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ పూర్తి చేసిన తర్వాతే ఆటగాళ్ళు శిబిరంలో చేరతారు.

అయితే, కెప్టెన్‌ కోహ్లీ లేకుండానే ఆర్‌సీబీ ప్రాక్టీస్‌ను ప్రారంభించడం విశేషం. కోహ్లి గురువారం(ఏప్రిల్‌ 1న) జట్టులో చేరనున్నాడని ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది. కోహ్లికి కూడా వారం రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ నిబంధన వర్తిస్తుందని, జట్టులో చేరిన తరువాత ఆయన కూడా వారం రోజులు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుందని ఆర్‌సీబీ ఉన్నతాధికారులు తెలిపారు. ఏప్రిల్‌ 9న చెన్నై వేదికగా ప్రారంభంకానున్న సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆర్‌సీబీ.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఢీకొంటుంది.
చదవండి: ముంబై జట్టును లోడెడ్‌ గన్‌తో పోల్చిన సన్నీ

మరిన్ని వార్తలు