Chris Morris: ఇజ్జత్‌ అంటే ఇదేనేమో.. వెల్‌డన్‌ మోరిస్‌!

16 Apr, 2021 11:40 IST|Sakshi
ఆర్‌ఆర్‌ ఆటగాడు క్రిస్‌ మోరిస్‌(Photo Courtesy: Virender Sehwag Twitter)

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు క్రిస్‌ మోరిస్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 16 కోట్ల రూపాయలు పెట్టి కొన్నందుకు జట్టుకు విజయం అవసరమైన సమయంలో రాణించిన తీరుపై సోషల్‌ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పంజాబ్‌ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌ఆర్‌ కెప్టెన్‌ సంజూ సామ్సన్‌ సింగిల్‌ తీయకుండా తనను తక్కువ చేసినందుకు క్రిస్‌ మోరిస్‌ ఇలా బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడంటూ నెటిజన్లు మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు. ‘‘యోగ్యుడు అయినప్పటికీ తనను ఎవరూ గుర్తించనపుడు చాలా బాధ కలుగుతుంది కదా. కానీ మనదైన రోజు తప్పక గుర్తింపు వస్తుంది. అందుకు ఇదే ఉదాహరణ. సంజూ ఇప్పుడేమంటాడో’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

కాగా గురువారం నాటి మ్యాచ్‌లో క్రిస్‌ మోరిస్‌ 18 బంతుల్లోనే 36 పరుగులు(4 సిక్సర్లు, నాటౌట్‌) చేసి చేజారుతుందనుకున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ను గెలుపుబాట పట్టించాడు. ఫలితంగా, పంత్‌ సేన తలవంచకతప్పలేదు. రాజస్తాన్‌ చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో మోరిస్‌ ఇన్నింగ్స్‌పై స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అతడిపై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా రెండు ఫొటోలు షేర్‌ చేసిన వీరూ భాయ్‌.. ‘‘పిక్‌ 1 అంతకుముందు మ్యాచ్‌కు సంబంధించింది: డబ్బులు వచ్చాయి కానీ ఇజ్జత్‌ లేకుండాపోయింది. రెండో పిక్‌ నేటి మ్యాచ్‌కు సంబంధించింది: దీనినే ఇజ్జత్‌ అంటారేమో. ఈసారి డబ్బుతో పాటు గౌరవం కూడా. వెల్‌డన్‌ క్రిస్‌ మోరిస్‌’’అంటూ తనదైన శైలిలో ట్వీట్‌ చేశాడు. ఇక ఆకాశ్‌ చోప్రా సైతం.. పైసా వసూల్‌ పర్ఫామెన్స్‌ అంటూ కితాబిచ్చాడు.

చదవండి: సామ్సన్‌.. నా బ్యాటింగ్‌ చూడు!
IPL 2021, DC vs RR: మోరిస్‌ మ్యాజిక్

మరిన్ని వార్తలు