రాజస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ: అప్పుడు స్టోక్స్‌.. ఇప్పుడు..

21 Apr, 2021 08:32 IST|Sakshi
Photo Courtesy: Rajasthan Royals Twitter

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాజస్తాన్‌ రాయల్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో ఆటగాడు జట్టును వీడాడు. కఠినమైన ‘బయో బబుల్‌’ వాతావరణంలో ఇమడలేక ఇంగ్లండ్‌ క్రికెటర్, ఆర్‌ఆర్‌ జట్టు సభ్యుడు లియామ్‌ లివింగ్‌స్టోన్‌ ఐపీఎల్‌ -2021 టోర్నమెంట్‌ నుంచి వైదొలిగాడు. స్వదేశం ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌ ట్విటర్‌ వేదికగా మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు.. ‘‘లియామ్‌ లివింగ్‌స్టోన్‌ గత రాత్రి స్వదేశానికి వెళ్లిపోయాడు. ఏడాది కాలంగా బయోబబుల్‌లో ఉండలేక ఈ నిర్ణయం తీసుకున్నాడు. తన పరిస్థితిని మేం అర్థం చేసుకోగలం. అందుకే అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. తనకు ఎలాంటి మద్దతు అవసరమైనా ఎల్లప్పుడూ మేం సిద్ధంగా ఉంటాం’’ అని పేర్కొంది.

కాగా ఈ ఏడాది మినీ వేలంలో రాజస్తాన్‌ జట్టు లివింగ్‌స్టోన్‌ను అతని కనీస ధర రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో రాజస్తాన్‌ మూడు మ్యాచ్‌లు ఆడినా తుది జట్టులో లివింగ్‌స్టోన్‌కు చోటు దక్కలేదు. ఇక ఇప్పటికే చేతి వేలి గాయం కారణంగా రాజస్తాన్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అంతేగాక, మరో ఆటగాడు జోఫ్రా ఆర్చర్‌ సైతం ఇంతవరకు జట్టుతో చేరనేలేదు. ఈ సీజన్‌ మొదలుకావడానికి ముందే అతడి చేతికి సర్జరీ జరిగింది. దీంతో అతడు ఇప్పటివరకు టోర్నీకి దూరంగానే ఉన్నాడు.

చదవండి: ‘వారిద్దరూ ఔటైతే ఇక మిగతా జట్టంతా ఐసీయూనే’

మరిన్ని వార్తలు