స్థానిక ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకపోవడంపై చురకలు

15 Apr, 2021 20:20 IST|Sakshi

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంపై భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్‌ సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఆగ్రహం వ్యక్తం చేశాడు. హైదరాబాద్‌ జట్టులో స్థానిక ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే హైదరాబాద్‌ ఈ సీజన్‌లో ఎక్కువ విజయాలు నమోదు చేసే అవకాశాలు కనిపించట్లేదన్నాడు. సన్‌రైజర్స్‌ వరుస పరాజయాలపై ట్విటర్ వేదికగా స్పందించిన ఆయన.. టీం మేనేజ్‌మెంట్ తీరును తప్పుబట్టాడు. తుది జట్టులో ఆడేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఆటగాడు కూడా కనిపించలేదా అని ప్రశ్నించాడు. 

గత సీజన్‌లో భావనక సందీప్‌ను తీసుకున్నా.. అతనికి తుది జట్టులో ఆడే అవకాశం ఇవ్వకపోగా.. ఈ సీజన్‌లో ఏకంగా వదిలించుకోవడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలుగు రాష్ట్రాల నుంచి మహ్మద్ సిరాజ్ ఆర్‌సీబీకి ఆడుతుంటే.. అంబటి రాయుడు, హరిశంకర్ రెడ్డి చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని ఆయన గర్తు చేశారు. అంతే కాకుండా ఐపీఎల్ వేదికల్లో హైదరాబాద్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. కరోనా విజృంభిస్తున్న వేళ అత్యంత సురక్షితమైన హైదరాబాద్‌లో మ్యాచ్‌లు నిర్వహించకపోవడం ఏంటని ఆయన నిలదీశాడు .

సన్‌రైజర్స్ ఆటతీరు చూస్తుంటే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించేలా కనిపించట్లేదని, దీని వల్ల సొంత అభిమానులు దూరమవుతున్నారని పేర్కొన్నాడు. ఈ విషయమై సన్‌రైజర్స్‌ యాజమాన్యం ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 6 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ ఓ దశలో 16 ఓవర్లలో 115/2 పరుగులతో పటిష్టంగా కనిపించింది. అయితే మిడిలార్డర్‌ పూర్తిగా చేతులెత్తేయడంతో హైదరాబాద్‌ మ్యాచ్‌ను చేజార్చుకుంది. 
చదవండి: అరుదైన క్లబ్‌లో చేరికకు వికెట్‌ దూరంలో..‌

మరిన్ని వార్తలు