Rishabh Pant: అతడిపై ఒత్తిడి సహజం.. ఇక కెప్టెన్‌గా.. : మంజ్రేకర్‌

22 Sep, 2021 14:33 IST|Sakshi

Sanjay Manjrekar Comments On Rishabh Pant: టీమిండియా యువ కెరటం రిషభ్‌ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు కెప్టెన్‌గా కొనసాగించాలన్న ఫ్రాంఛైజీ నిర్ణయాన్ని భారత మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్‌ సమర్థించాడు. ఇదొక ఒక గొప్ప నిర్ణయమని కొనియాడాడు. పంత్‌లో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయని, అతడిని ఎంపిక చేసి మంచి పనిచేశారంటూ ప్రశంసించాడు. కాగా ఐపీఎల్‌-2021 సీజన్‌ ఆరంభంలో శ్రేయస్‌ అయ్యర్‌ గాయం కారణంగా దూరం కావడంతో, అతడి స్థానంలో రిషభ్‌ పంత్‌ సారథ్య బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

అతడి కెప్టెన్సీలో ఢిల్లీ మంచి విజయాలు నమోదు చేసింది. కరోనా కారణంగా లీగ్‌ వాయిదా పడే నాటికి 8 మ్యాచ్‌లు ఆడి.. ఆరింటిలో గెలిచి 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌తో రెండో అంచెలో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇదిలా ఉండగా.. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్‌ అయ్యర్‌ జట్టుతో చేరిన సంగతి తెలిసిందే. 


ఫొటో: IPL

ఈ నేపథ్యంలో అతడికే పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు మొదట్లో వార్తలు వినిపించాయి. అయితే, ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ఫ్రాంఛైజీ పంత్‌ వైపే మొగ్గు చూపింది. ఈ పరిణామాల నేపథ్యంలో కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ మాట్లాడుతూ.. ‘‘రిషభ్‌ పంత్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలన్న ఢిల్లీ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం అద్భుతం. అతడిలో నాయకత్వ లక్షణాలు పుష్కలం. 

గల్లీ క్రికెట్‌ నుంచి కెప్టెన్‌ వరకు ఎదిగిన అతడి ప్రయాణం అమోఘం. ఇక శ్రేయస్‌ విషయానికొస్తే.. బ్యాటర్‌గా తనను నిరూపించుకోవాల్సి ఉంటుంది. అతడిపై ఒత్తిడి పెరగటం సహజం’’ అని పేర్కొన్నాడు. ఇక పవర్‌ హిట్టర్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌ లైనప్‌ పటిష్టంగా ఉందన్న సంజయ్‌ మంజ్రేకర్‌... ఒక్కోసారి నిలకడలేమి వల్ల ఓటమి చవిచూడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని అన్నాడు. ధవన్‌, పృథ్వీ షా, రిషభ్‌ పంత్‌, హెట్‌మెయిర్‌, స్టొయినిస్‌.. వంటి కీలక ఆటగాళ్లు విఫలమైతే మాత్రం పరిస్థితులు తారుమారవుతాయని చెప్పుకొచ్చాడు.

చదవండి: Sanju Samson: గెలుపుతో జోరు మీదున్న రాజస్తాన్‌కు ఎదురుదెబ్బ!
Sun Risers Hyderabad: కేన్‌ మామ అదరగొట్టాడు.. అయినా అర్ధ సెంచరీ వృథా!

A post shared by Sanjay Manjrekar (@sanjaysphotos)

మరిన్ని వార్తలు