ఆఫ్‌ స్పిన్‌ టెస్టుల్లో మాత్రమే వేస్తావా.. టీ20ల్లో వేయవా!

11 Apr, 2021 17:13 IST|Sakshi
కర్టసీ: ఐపీఎల్‌/ బీసీసీఐ

ముంబై: టీమిండియా ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐపీఎల్‌ 14వ సీజన్‌ను ఫేలవ ప్రదర్శనతో ఆరంభించాడు. శనివారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన అశ్విన్‌ 11ఎకానమీతో 47 పరుగులిచ్చి ఒక వికెట్‌ మాత్రమే తీశాడు. అయితే అశ్విన్‌ ఐపీఎల్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో దుమ్మురేపాడు. తన ఆఫ్‌స్పిన్‌ మాయజాలంతో ఏకంగా ఆ సిరీస్‌లో 32 వికెట్లు పడగొట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు. అయితే ఐపీఎల్‌లో మాత్రం అశ్విన్‌ తొలి మ్యాచ్‌లోనే తేలిపోవడంపై మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ తప్పుబట్టాడు.

''అశ్విన్‌ టెస్టులో మాత్రమే ఆఫ్‌స్పిన్‌ బౌలింగ్‌ వేయగలడా అన్న అనుమానం కలుగుతుంది. టీమిండియా తరపున పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరమైన అశ్విన్‌ ఐపీఎల్ ద్వారా టీ20 మ్యాచ్‌లు ఆడుతున్నాడు. టెస్టుల్లో ఎక్కువ ఓవర్లు వేసే అవకాశం ఉండడంతో తన ఆఫ్‌స్పిన్‌ మ్యాజిక్‌ చూపించగలడు. అదే టీ20 మ్యాచ్‌కు వచ్చేసరికి తెల్లబంతితో నాలుగు ఓవర్లు మాత్రమే వేసే అవకాశం ఉంటుంది. అందుకే అశ్విన్‌ ఈ ఫార్మాట్‌లో ఆఫ్‌స్పిన్‌ కన్నా పరుగులు ఇవ్వకూడదనే ఉద్దేశంతో బౌలింగ్‌ చేస్తున్నాడు. అందుకే నిన్నటి మ్యాచ్‌లో రైనా, మొయిన్‌ అలీలు అశ్విన్‌ బౌలింగ్‌ను ఉతికారేశారు. దీని బట్టి చూస్తే టీ20ల్లో అశ్విన్‌ ఆఫ్‌ స్పిన్‌ వేయడం కంటే పరుగులు ఇవ్వకూడదనే దానికే స్టిక్‌ అయినట్లు అనిపిస్తుంది. ఈ అలవాటును అశ్విన్‌ కాస్త తొందరగా మార్చుకుంటే ఫలితం వేరే విధంగా ఉంటుందనేది నా అభిప్రాయం'' అని చెప్పుకొచ్చాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్‌ సీఎస్‌కేపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రైనా 54, అలీ 36, సామ్‌ కరన్‌ 34 పరుగులతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఓపెనర్లు ధావన్‌ 85, పృథ్వీ షా 72 పరుగులతో చెలరేగడంతో ఢిల్లీ సునాయస విజయాన్ని నమోదు చేసింది.
చదవండి: సన్‌రైజర్స్‌తో ఆనాటి మ్యాచ్‌ గుర్తుకో తెచ్చుకో రసెల్‌..!

మరోసారి తన విలువేంటో చూపించిన రైనా

మరిన్ని వార్తలు