తుదిజట్టులో అతడికి స్థానం ఉంటేనే హైదరాబాద్‌ గెలుపు!

15 Apr, 2021 14:26 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్‌-2021 సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లలోనూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు నిరాశే ఎదురైంది. విజయం అంచుల వరకు వెళ్లి ఓటమి పాలైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఏప్రిల్‌ 11న జరిగిన మ్యాచ్‌లో బెయిర్‌స్టో, మనీశ్‌ పాండే మినహా మిగతా వారు విఫలం అయ్యారు. దీంతో 10 పరుగుల తేడాతో హైదరాబాద్‌ పరాజయం పాలైంది. ఇక రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన గురువారం నాటి మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం మరోసారి స్పష్టంగా కనబడింది. వార్నర్‌ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు. బౌలర్లు ఆర్సీబీ బ్యాట్‌మెన్‌ను కట్టడి చేసినా... బ్యాటర్లు రాణించకపోవడంతో నిరాశ తప్పలేదు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 6 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో సన్‌రైజర్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ కేన్‌ విలియమ్సన్‌ జట్టులో లేని లోటు స్పష్టంగా కనబడిందని, తను ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ సైతం ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు. ‘‘ఈనాటి మ్యాచ్‌ ఫలితం తర్వాత నేనిలా మాట్లాడటం లేదు. ఎస్‌ఆర్‌హెచ్‌కు ఎల్లప్పుడూ కేన్‌ విలియమ్సన్‌ సేవలు అత్యవసరం. ఏం జరిగినా సరే తుదిజట్టులో అతడికి స్థానం ఉండాల్సిందే’’ అని పేర్కొన్నాడు. సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌ సైతం అతడితో ఏకీభవిస్తున్నారు. ఇక టీమిండియా దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా బాలీవుడ్‌లోని ఓ పాటను ప్రస్తావిస్తూ.. ‘‘ఎవరి కోసం నిరీక్షణ.. నేను ఉన్నా కదా’’ అని అర్థం వచ్చేలా ట్వీట్‌ చేశాడు. కాగా ఫిట్‌నెస్‌ సాధించని కారణంగా విలియమ్సన్‌ జట్టుకు దూరమైనట్లు కోచ్‌ బేలిస్‌ తెలియజేసిన విషయం తెలిసిందే. ఇక కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌కు మంచి ఐపీఎల్‌ రికార్డు ఉంది. ఇప్పటి వరకు మొత్తంగా 53 మ్యాచ్‌లు ఆడిన అతడు, 1619 పరుగులు చేశాడు. ఇక 2018 ఎడిషన్‌లో అత్యధిక పరుగులు(735) చేసి ఆరెంజ్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.

చదవండి: బాధిస్తోంది.. మాకు కూడా అదే జరిగింది: వార్నర్‌

>
మరిన్ని వార్తలు