నేను కెప్టెన్‌ అవుతానని అస్సలు ఊహించలేదు: సంజూ

4 Apr, 2021 10:46 IST|Sakshi

ముంబై: ఐపీఎల్‌ మొదటి సీజన్‌లో విజేతగా నిలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన నమోదు చేయలేదు. ఇప్పటివరకు జరిగిన 13 సీజన్లలో రాయల్స్‌కు కెప్టెన్లు మారినా ఆ జట్టు తలరాత మాత్రం మారలేదు. కాగా గతేడాది సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 8 ఓటములతో దారుణ ప్రదర్శన కనబరిచి పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. కెప్టెన్‌గా విఫలమైన స్టీవ్‌ స్మిత్‌ను జట్టు నుంచి రిలీజ్‌ చేసిన రాయల్స్‌ సంజూ శాంసన్‌కు పగ్గాలు అప్పజెప్పింది.

రాజస్తాన్‌ రాయల్స్‌ గతేడాది జట్టుగా విఫలమైనా సంజూ శాంసన్‌, రాహుల్‌ త్రిపాఠి లాంటి ఆటగాళ్లు కొన్ని మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. కాగా కష్టకాలంలో రాయల్స్‌ కెప్టెన్‌గా ఎంపికైన శాంసన్‌ ముందు సవాళ్లు చాలానే ఉన్నాయి. జట్టును సమన్వయంతో నడిపిస్తూనే.. బెన్‌ స్టోక్స్‌, బట్లర్‌, ఆర్చర్‌ లాంటి ఆటగాళ్లతో కలిసి ఆడనుండడం.. టైటిల్‌ సాధించాలనే కల అతనికి సవాల్‌గా మారనుంది.తాజాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌కు సిద్ధమవుతున్న రాజస్తాన్‌ రాయల్స్‌ గురించి కొత్త కెప్టెన్‌ సంజూ శాంసన్‌ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
చదవండి: రాజస్తాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ షెడ్యూల్‌ కోసం క్లిక్‌ చేయండి

'కెప్టెన్‌గా రాజస్తాన్‌ రాయల్స్‌ను నడిపించేందుకు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నా. ఒక నాయకుడిగా జట్టును ఎలా నడిపించాలనే దానిపై మనుసులో చాలా ఆలోచనలు ఉన్నా.. దానిని ఆచరణలో పెట్టడం కాస్త కష్టమే అయినా ప్రయత్నిస్తా. ఈ బాధ్యతలతో మాత్రం సంతోషంగా ఉన్నా. నిజాయితీగా చెప్పాలంటే నేను రాయల్స్‌కు కెప్టెన్‌ అవుతానని గతేడాది చివరి వరకు అస్సలు ఊహించలేదు. మా జట్టు మేనేజర్‌ మనోజ్‌ బాద్లే నా దగ్గరకు వచ్చి.. నీ మీద మాకు నమ్మకం ఉంది...నువ్వు కెప్టెన్‌గా పనిచేసేందుకు సిద్ధంగా ఉండని చెప్పాడు.

కాగా రాయల్స్‌ కొత్త డైరెక్టర్‌ కమ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కుమార సంగక్కరతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా. అంతర్జాతీయ వికెట్‌ కీపర్‌గా శ్రీలంకకు సేవలు అందించిన సంగక్కర లాంటి లెజెండ్‌తో కలిసి పనిచేయడమే గాక.. కెప్టెన్సీ లక్షణాలతో పాటు.. వికెట్‌ కీపింగ్‌లో మరిన్ని మెళుకువలు నేర్చుకునే అవకాశం దొరికింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఈ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 12న ముంబై వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో ఆడనుంది.
చదవండి: 
ఆటగాడికి కరోనా.. ఆర్‌సీబీలో కలవరం

ఐపీఎల్‌ చరిత్రలో ఈ వికెట్‌ కీపర్లు ప్రత్యేకం

మరిన్ని వార్తలు