IPL 2021 Second Phase: ఇంగ్లీష్ క్రికెట‌ర్ల‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ క్రికెట‌ర్

13 Sep, 2021 13:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ 2021 మలిదశ మ్యాచ్‌లు మ‌రికొన్ని రోజుల్లో ప్రారంభంకానుండగా లీగ్‌కు అందుబాటులో ఉండలేమంటూ ఇంగ్లండ్ క్రికెట‌ర్లు డేవిడ్ మ‌లాన్‌(పంజాబ్‌ కింగ్స్‌), క్రిస్ వోక్స్‌(ఢిల్లీ క్యాపిటల్స్‌), జానీ బెయిర్‌స్టో(సన్‌రైజర్స్‌) ఆయా ఫ్రాంఛైజీలకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెట‌ర్ ఆకాశ్ చోప్రా సదరు ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. వాళ్లు చేసిన ప‌నిని ఐపీఎల్ కుటుంబం ఎప్ప‌టికీ మ‌ర‌చిపోద‌ని, భ‌విష్య‌త్తులో వాళ్లు తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించాడు.

అ​కారణంగా లీగ్‌ నుంచి త‌ప్పుకోవ‌డం అంటే సదరు ప్లేయ‌ర్ అతని ఫ్రాంఛైజీని మోసం చేసినట్లేనని, దీన్ని ఫ్రాంఛైజీలు న‌మ్మ‌క ద్రోహంగా భావిస్తాయ‌ని, ఈ విషయాన్ని ఇంగ్లండ్ ఆటగాళ్లు గుర్తు పెట్టుకోవాల‌ని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఇలా స‌డెన్‌గా ఆటగాళ్లు త‌ప్పుకోవ‌డం ఫ్రాంఛైజీల‌ను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ప్రతి ఆటగాడి విషయంలో యాజమాన్యాలు వ్యూహ‌ర‌చ‌న చేస్తాయ‌ని, అలాంటిది ఆ ప్లేయ‌ర్ స‌డెన్‌గా త‌ప్పుకుంటే గేమ్‌ ప్లాన్‌ మొత్తం మారిపోతుందని, ఇది జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తుందని పేర్కొన్నాడు. 

కాగా, ఇదివరకే పలువురు ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాళ్లు వివిధ కారణాల చేత లీగ్‌ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌ రాయల్స్‌కు చెందిన జోస్‌ బట్లర్‌, జోఫ్రా ఆర్చర్‌, బెన్‌ స్టోక్స్‌ ఐపీఎల్‌కు అందుబాటులో ఉండమని ప్రకటించారు. తాజాగా మ‌లాన్‌, వోక్స్‌, బెయిర్‌స్టో కూడా రావ‌డం లేద‌ని చెప్పారు. అటు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు సామ్‌ కర్రన్‌, మొయిన్‌ అలీలు సైతం ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు కొత్త గైడ్‌లైన్స్‌ కారణంగా ప్లేఆఫ్స్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్క‌న ఎనిమిది మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు ఐపీఎల్‌ మలిదశ ఐపీఎల్‌కు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. దీంతో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ప్రణాళిక ప్రకారం టోర్నీని సామూహికంగా ఎగ్గొట్టినట్లు స్పష్టమవుతోంది. 
చదవండి: మా పిచ్‌లపై 10-15 మ్యాచ్‌లు ఆడితే వాళ్ల కెరీర్‌లు ముగిసినట్టే..
 

మరిన్ని వార్తలు