IPL 2021 Second Phase: ధోని సేనకు భారీ షాక్‌.. ఒకేసారి నలుగురు స్టార్‌ ఆటగాళ్లు దూరం

13 Sep, 2021 11:18 IST|Sakshi

దుబాయ్‌: ఐపీఎల్ 2021 రెండో దశ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆటగాళ్లు ఇద్దరు గాయాల బారిన పడగా.. మరో ఇద్దరు ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరని తెలుస్తోంది. ప్రస్తుతం సీపీఎల్ 2021లో ఆడుతున్న బ్రావో, డుప్లెసిస్ గాయపడగా.. ఇంగ్లండ్‌ క్రికెటర్లు సామ్ కరన్, మొయిన్ అలీలు టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ప్లేఆఫ్స్‌కు దూరం కానున్నారు. గాయం కారణంగా బ్రావో కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం కానుండగా, పాకిస్తాన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో తగిలిన గాయం తిరగబెట్టడంతో డుప్లెసిస్‌ ఐపీఎల్‌ మొత్తానికే దూరమయ్యే ప్రమాదం ఉంది.

మరోవైపు ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కరన్, మొయిన్ అలీలు ఐపీఎల్ అనంతరం రెండు రోజుల్లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం బయో బబుల్‌లోకి వెళ్లిపోనున్నారు. ఈసీబీ నిబంధనల ప్రకారం వారు మెగా టోర్నీ ​ప్రారంభానికి మందే ఇంగ్లండ్ బృందంలో చేరాల్సి ఉంది. ఇలా ఒకేసారి నలుగురు స్టార్‌ ఆటగాళ్లు దూరం కానుండడంతో సీఎస్‌కే టైటిల్‌ గెలవాలన్న ఆశలు గల్లంతయ్యేలా కనిపిస్తున్నాయి.

ఐపీఎల్ తొలి సీజన్ వాయిదా పడే సమయానికి 7 మ్యాచ్‌లాడిన చెన్నై.. ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరో మూడు మ్యాచ్‌లు గెలిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం. అయితే మొదటి దశలో కీలకపాత్ర పోషించిన డుప్లెసిస్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌లు కీలక దశలో జట్టును వీడితే ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కాగా, సెప్టెంబరు 19న చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ మలిదశ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.
చదవండి: పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కోహ్లి.. రోహిత్‌కు పగ్గాలు..?

మరిన్ని వార్తలు