కేకేఆర్‌ మిడిలార్డర్‌పై ధ్వజమెత్తిన వీరూ

14 Apr, 2021 16:41 IST|Sakshi

చెన్నై: ముంబైతో మ్యాచ్‌ను చేజేతులా జారవిడిచిన కేకేఆర్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్లు దినేశ్‌ కార్తీక్‌(11 బంతుల్లో 8 నాటౌట్‌), ఆండ్రీ రసెల్‌(15 బంతుల్లో 9)లపై టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరాల్సిన సమయంలో రసెల్‌, డీకేలు అలసత్వం ప్రదర్శించడాన్ని ఆయన ప్రశ్నించాడు. సరిపడా బంతులు, చేతిలో వికెట్లున్నా ఎదురుదాడి చేయకపోవడం ఏంటని నిలదీశాడు. రసెల్‌ క్రీజ్‌లోకి వచ్చినప్పుడు 27 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉంది, చేతిలో ఇంకా 5 వికెట్లు ఉన్నాయి.

సునాయాసంగా గెలవాల్సిన ఇలాంటి పరిస్థితుల్లో కూడా వారిలో జట్టును గెలిపించాలన్న కసి కనిపించలేదని విమర్శించాడు. తొలి మ్యాచ్‌ విజయం అనంతరం కెప్టెన్‌ మోర్గాన్‌ చెప్పిన సానుకూల దృక్పథం అన్నది వీరిద్దరిలో ఏ కోశానా కనపడలేదని ఎద్దేవా చేశాడు. వారు మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు తీసుకెళ్లి గెలిపిద్దామనుకుని విఫలంమయ్యారని ఆరోపించారు.

రసెల్‌, డీకేల కంటే ముందు బ్యాటింగ్‌కు దిగిన శుభ్‌మన్‌, నితీశ్ రాణా, షకిబ్‌, మోర్గాన్‌లు జట్టును గెలిపించాలన్న ఉద్దేశంతో బ్యాటింగ్‌ చేశారని, ఈ క్రమంలో వారు వికెట్లు కోల్పోయారని, కానీ రసెల్‌, డీకేల పరిస్థితి అలా కనిపించలేదని విమర్శించాడు. ఈ ఓటమితో కేకేఆర్‌ సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. కేకేఆర్‌ ఓటమిపై ఆ జట్టు సహా యజామని షారుక్‌ ఖాన్‌ సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడినందుకుగాను ఆయన అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పాడు. కాగా, రోహిత్‌ సేన నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మోర్గాన్‌ బృందం 10 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు