పొలార్డ్‌ను మరిపిస్తున్నాడు.. ఆ సాహసం చేయలేను: కుంబ్లే

5 Apr, 2021 16:50 IST|Sakshi

ముంబై: ఈ ఐపీఎల్‌ సీజన్‌కు సంబంధించి ఫిబ్రవరిలో జరిగిన వేలంలో తమిళనాడుకు చెందిన యువ క్రికెటర్‌ షారుఖ్‌ ఖాన్‌ను పంజాబ్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది. కుడి చేతి వాటం స్పిన్నర్‌ అయిన షారుఖ్‌‌.. హార్ద్‌ హిట్టర్‌ కూడా. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో ఆకట్టుకోవడంతో షారుఖ్‌ వెలుగులోకి వచ్చాడు. లోయర్‌-మిడిల్‌ ఆర్డర్‌లో 30 నుంచి 40 పరుగుల్ని ఈజీగా సాధిస్తూ ఐపీఎల్‌ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. షారుఖ్‌పై ముందు నుంచీ కన్నేసిన పంజాబ్‌ కింగ్స్‌.. వేలంలో భారీ ధర చెల్లించి తీసుకుంది. అతని కనీస ధర రూ. 20లక్షలు ఉంటే రూ. 5 కోట్ల 25 లక్షలకు పంజాబ్‌ పోటీ పడి మరీ కొనుగోలు చేసింది. ప్రధానంగా ఒక హిట్టర్‌ కావాలనే ఉద్దేశంతో షారుఖ్‌పై ముందు నుంచి ఫోకస్‌  చేసిన పంజాబ్‌ అతన్ని తీసుకున్న వెంటనే ఆనందం వ్యక్తం చేసింది. 

ఇదిలా ఉంచితే, పంజాబ్‌ కింగ్స్‌ ప్రాక్టీస్‌లో షారుఖ్‌ ఖాన్‌ ఆకట్టుకోవడంపై ఆ ఫ్రాంఛైజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఏకంగా ఆ యువ క్రికెటర్‌ను ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ప్లేయర్‌ కీరోన్‌ పొలార్డ్‌తో పోలుస్తున్నాడు. షారుఖ్‌ షాట్లు చూస్తుంటే తనకు పొలార్డ్‌ గుర్తుకు వస్తున్నాడంటూ కుంబ్లే పేర్కొన్నాడు.  గతంలో ముంబై ఇండియన్స్‌కు మెంటార్‌గా పని చేసిన సమయంలో పొలార్డ్‌కు నెట్స్‌ బౌలింగ్‌ వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. 

తాను నెట్స్‌లో పొలార్డ్‌కు బౌలింగ్‌ వేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే షారుక్‌ కూడా అవే స్కిల్స్‌ ఉన్నాయంటూ కొనియాడాడు. ‘ నేను ముంబై ఇండియన్స్‌తో కలిసి పని చేసిన సమయంలో పొలార్డ్‌ చాలా ప్రమాదకరంగా కనిపించేవాడు. నేను అతనికి పదే పదే ఒకే విషయం చెప్పేవాడిని. నా వైపు స్టైయిట్‌ బంతిని కొట్టకు అనే చెప్పేవాడిని. కానీ ఇప్పుడు షారుక్‌కు బౌలింగ్‌ వేసే ధైర్యం చేయడం లేదు. నా వయసు పెరిగింది. నా శరీరం బౌలింగ్‌ చేయడానికి సహకరించడం లేదు. దాంతో షారుఖ్‌కు కూడా బౌలింగ్‌ చేసే సాహసం చేయడం లేదు. అతని ప్రాక్టీస్‌ను గమనిస్తే పొలార్డ్‌ షాట్లే నాకు గుర్తుకు వస్తున్నాయి’అని కుంబ్లే తెలిపాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఏప్రిల్‌ 12వ తేదీన పంజాబ్‌ కింగ్స్‌- రాజస్తాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది. 

ఇక్కడ చదవండి: రూ. 8 కోట్లు పెట్టి కొన్నారు.. మెరెడిత్‌కు స్థానం లేదా!

పంజాబ్‌ కింగ్స్‌ జట్టు ఇదే

మరిన్ని వార్తలు